
ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై సుంకం 20 శాతానికి పెంపు: కేంద్ర ఆర్థిక శాఖ
భారత్‌ను ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ స్క్రీన్ల (ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే)పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుండి 20 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విదేశాల్లో తయారై భారతదేశానికి వచ్చే టీవీలు, మానిటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం కేవలం పన్నులు పెంచడమే కాకుండా, దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకుంది. టీవీల తయారీలో అత్యంత కీలకమైన 'ఓపెన్ సెల్స్' (స్క్రీన్ లోపల ఉండే భాగాలు), ఇతర ముఖ్యమైన విడిభాగాలపై పన్నును 5 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా గత బడ్జెట్‌లో 2.5 శాతంగా ఉన్న కొన్ని విడిభాగాలపై పన్నును ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే.. విదేశాల నుండి పూర్తి వస్తువును కొంటే పన్ను ఎక్కువ పడుతుంది, అదే విడిభాగాలను తెచ్చి ఇండియాలోనే తయారు చేస్తే పన్ను తక్కువ పడుతుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యం ఉంది. గతంలో స్మార్ట్‌ఫోన్ల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. విదేశీ ఫోన్లపై పన్నులు పెంచి, విడిభాగాలపై తగ్గించడం వల్ల నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఎదిగింది. ఇప్పుడు అదే పద్ధతిని టీవీలు, ఎలక్ట్రానిక్ స్క్రీన్ల రంగంలో కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో దిగ్గజ కంపెనీలు భారతదేశంలోనే ఫ్యాక్టరీలు పెట్టాల్సి వస్తుంది, తద్వారా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
ప్రస్తుతానికి విదేశీ బ్రాండ్లు, దిగుమతి చేసుకునే ఖరీదైన టీవీల ధరలు కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో దేశీయంగా ఉత్పత్తి పెరిగి ధరలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ కేవలం తన స్వయం సమృద్ధి కోసమే కాకుండా, ప్రపంచ దేశాలకు ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు.
