
ఎల్‌అండ్‌టీ ఎందుకు వెళ్లిపోతుంది?
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1ను తన చేతిలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. లార్సెన్ అండ్ టౌబ్రో (ఎల్‌అండ్‌టీ)కు రూ.2 వేల కోట్లు వన్ టైం సెటిల్ మెంట్ చేస్తూ.. రూ.13 వేల కోట్ల రుణాన్ని తామే భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ పూర్తిగా వైదొలగనుంది. రాష్ట్రంలో మెట్రో విస్తరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను 2010లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ప్రారంభించారు. ఫేజ్-1 (69 కి.మీ. విస్తీర్ణం, మూడు కారిడార్లు) ఆపరేషన్‌లో ఎల్‌అండ్‌టీ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, ప్రభుత్వ సహాయం లేకపోవడం వంటి కారణాల వల్ల కంపెనీ వైదొలగాలని అభ్యర్థించినట్టు తెలుస్తోంది. 2017 నవంబర్‌లో మొదటి కారిడార్ ప్రారంభమైనప్పటికీ, 2020 ఫిబ్రవరి వరకు పూర్తయినా, ఆపరేషన్‌లో నష్టాలు వచ్చినట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎల్‌టీఎమ్‌ఆర్‌ఎచ్‌ఎల్) ఆదాయం 21 శాతం తగ్గి రూ.1,108.54 కోట్లకు, ట్యాక్స్‌కు ముందు, తర్వాత నష్టం 13 శాతం పెరిగి రూ.625.88 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు కంపెనీ రూ.14 వేల కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ.7 వేల కోట్లు నష్టాలుగానే ఉన్నాయని కంపెనీ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఎల్‌అండ్‌టీ తాము వైదొలగాలని కోరుకుంటున్నట్టు తెలిసింది.
ఎల్ అండ్ టీ వెళ్లిపోవడంపై కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ ఎందుకు వెళ్లిపోతుందని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరి వల్లే ఈ సంస్థ వెళ్లిపోతున్నదని పేర్కొన్నారు. ఆ సంస్థకు హైద్రాబాద్ మెట్రోకు సంబంధించి 2070 దాకా లీజు ఉందని కేటీఆర్ తెలిపారు. ఇంకా 45 ఏండ్లు సమయం ఉన్నప్పటికీ ఎందుకు వెళ్లిపోయిందని ప్రశ్నించారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 2,100 కోట్లు ఎల్ అండ్ టీకి చెల్లించి, రూ.13,000 కోట్ల రుణాన్ని తీసుకునే ఈ డీల్, మెట్రో ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
దీనిపై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. మొదట మెటాస్ సంస్థ టెండర్ తీసుకున్నా, తర్వాత ఎల్ అండ్ టీకి అప్పగించారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు పనులు 25% మాత్రమే పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం (కేసీఆర్) దీన్ని త్వరితగతిలో పూర్తి చేసి, 2017 నవంబర్ 29న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించింది. కోవిడ్ సమయంలో ఎల్ అండ్ టీ కష్టాలు పడినప్పుడు, రూ. 900 కోట్లు వడ్డీ లేని రుణంగా ఇచ్చి, 2070 వరకు లీజు ఇచ్చారు. 69 కిమీల ఫేజ్-1 (పాతబస్తీ మినహా) పూర్తి చేసి, హైటెక్ సిటీ నుంచి రహేజా మైండ్‌స్పేస్ వరకు విస్తరించారు. ఇక్కడే ఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) చుట్టూ 37 కిమీల ఎయిర్‌పోర్ట్ మెట్రోకు అంకురార్పణ చేశారు. మొత్తంగా 400 కిమీల విస్తరణకు పచ్చజెండా ఊపి, దశలవారీగా మిగతా భాగాల (భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్ వరకు)కు ఆమోదం ఇచ్చారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ నుంచి ఎల్ అండ్ టీ వెళ్లిపోవడం రాష్ట్రానికి మాయని మచ్చ" అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేసీఆర్ కేబినెట్ పచ్చజెండా ఊపింది. 160 కిలోమీటర్లు ఓఆర్ఆర్ చుట్టూ, ఇక మిగిలిన భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ దాకా కేబినెట్ ఆమోదం ఇచ్చాం. దశల వారీగా చేస్తామని చెప్పాం. ప్రజా రవాణాకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మెట్రోను కాపాడుకుంటూ, విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ.. సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోయాం. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మొదట్టమొదటి నిర్ణయం.. ఎయిర్ పోర్టు మెట్రోను అనాలోచితంగా రద్దు చేశారు. ఈ పాటికి అయిపోయేది.. రెండేండ్లు దాని టర్మ్. కేటీఆర్ భూములు ఉన్నాయట అని పిచ్చి ఆలోచనలతో ఎల్ అండ్ టీకి దెబ్బ కొట్టారు. వాళ్లను వెళ్లగొట్టారు. అక్కడ్నుంచి రేవంత్ రెడ్డికి ఎల్ అండ్ టీకి పంచాయతీ మొదలైంది’ అని కేటీఆర్ గుర్తు చేశారు.
