
ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందాం- డిప్యూటీ సీఎం
రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్య సంపద అయిన ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనే లక్ష్యంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆయన అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతాన్ని విత్తనాలు జల్లడం, వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్‌ను చట్టం ముందు నిలపడానికి వీలుగా, పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తే అక్రమరవాణాదారుల ఆటకట్టించడం సులువవుతుంది అని పేర్కొన్నారు. . చెట్లు నరకడానికి వస్తున్న కిందిస్థాయి కూలీలు, మేస్త్రీలు, సూపర్‌వైజర్లకు చట్టాలపై అవగాహన కల్పించి, కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి ఇతర ఉపాధి మార్గాలు చూపించాలని ఆయన సూచించారు. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలని కోరారు.
వైకాపా ప్రభుత్వం హయాంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సును నిర్వీర్యం చేయడం వల్లే అక్రమ రవాణాకు ద్వారాలు తెరిచినట్లైందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారని, కేవలం పట్టుబడిన దుంగల (తిరుపతి గోదాముల్లో 2,63,267 దుంగలు) ఆధారంగా చూసినా సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మాట్లాడి టాస్క్ ఫోర్సుకు మళ్లీ జీవం పోస్తానని తెలిపారు.
అంతర్రాష్ట్ర ఒప్పందాలను పటిష్టంగా అమలు చేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో చర్చించిన తర్వాత, దేశంలో ఎక్కడ దొరికినా ఆ ఎర్రచందనం మన రాష్ట్రానికి చెందేలా ప్రత్యేక ఆదేశాలను ఇప్పించినట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, ఢిల్లీలలో సీజ్ చేసిన సుమారు 28 టన్నులు, నేపాల్‌లో ఉన్న 173 టన్నుల ఎర్రచందనం తిరిగి రప్పించే ప్రక్రియ మొదలైందని, దీంతో పాటు 2019-24 మధ్య పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల దుంగలను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సాంకేతిక వినియోగంతో పాటు సిబ్బంది కృషి చాలా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘా, అటవీ చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు, గస్తీ పెంచాలని చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం కేసుల్లో 60 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలని, వేగం పెంచాలని సూచించారు. పోలీసు-అటవీ అధికారుల మధ్య సమన్వయం ప్రధానమని, ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేసే ఇంటి దొంగలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
