
ఎర్రజొన్న రైతులకు అన్యాయం చేస్తే సహించం: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ఎర్రజొన్న పంట ధరను కృత్రిమంగా తగ్గించి రైతులను నిలువునా ముంచేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు.
సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్న క్వింటాలుకు సుమారు రూ.3850 వరకు పలికిన ధర ప్రస్తుతం రూ.3400 నుంచి రూ.3450 వరకు పడిపోయిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. సహజంగా ఉత్పత్తి తగ్గిన సమయంలో ధర పెరగాల్సి ఉండగా, వ్యాపారులు కలిసి ధరను తగ్గించే ప్రయత్నం చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో ఎర్రజొన్న సాగు గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే చెప్పారు. గత ఏడాది సుమారు 34,000 ఎకరాల్లో సాగు జరిగితే, ఈసారి అది 23,000 ఎకరాలకు పడిపోయిందన్నారు. రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట వైపు మొగ్గుచూపడంతో ఎర్రజొన్న సాగు తగ్గిందని వివరించారు. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో మార్కెట్‌లో ధరలు కనీసం రూ.3850 నుంచి రూ.4000 వరకు ఉండాల్సి ఉండగా, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎర్రజొన్న ధరలు పడిపోవడానికి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, ఉత్తర భారత రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని, అక్కడ యుద్ధ పరిస్థితులు లేవని ఆయన అన్నారు. కాబట్టి ధరల తగ్గుదలకు చూపుతున్న కారణాలు సమంజసం కావని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. గత మూడు నాలుగేళ్లుగా అమలులో ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని, రైతులతో తప్పనిసరిగా బైబ్యాక్ ఒప్పందాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే రైతుల పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ రూరల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలాల్లో ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జిల్లా అగ్రికల్చర్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే మొక్కజొన్న ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఎర్రజొన్న ధరలు కూడా తగ్గితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని ఎమ్మెల్యే అన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కనీసం క్వింటాలుకు రూ.4000 ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రైతులు సంఘటితం కావాలని, గిట్టుబాటు ధర కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
