Let's talk: editor@tmv.in
ఎర్రచందనం సంరక్షణకు భారీ నిధులు

ఎర్రచందనం సంరక్షణకు భారీ నిధులు

Panthagani Anusha
20 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల అమూల్య సంపద, ప్రపంచవ్యాప్తంగా విలక్షణమైన గుర్తింపు ఉన్న ఎర్రచందనం (రెడ్ సాండర్స్) పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్ బిఏ) యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్( ఏబిఎస్) విధానం కింద ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు రూ.14.88 కోట్ల (సుమారు 1.65 మిలియన్ డాలర్లు) నిధులను తాజాగా విడుదల చేసింది. కాగా గతంలో స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న సుమారు 1,115 టన్నుల ఎర్రచందనం కలపను కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా వేలం వేయగా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని తిరిగి ఈ వృక్ష సంపద అభివృద్ధికి, పరిరక్షణకే కేటాయించారు. ఈ తాజా నిధుల విడుదలతో కలిపి, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మొత్తం ఏబిఎస్ చెల్లింపులు రూ. 143 కోట్లకు చేరుకోగా అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అత్యధికంగా రూ. 104 కోట్లు అందడం విశేషం.

29 ఫారం–I దరఖాస్తుల ద్వారా లభించిన ప్రయోజన–భాగస్వామ్య సహకారాలను నిధులను ప్రధానంగా అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు, రక్షణ చర్యలను కట్టుదిట్టం చేయడానికి, ఈ వృక్ష జాతి పునరుత్పత్తిపై శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి వినియోగించనున్నారు. ముఖ్యంగా తూర్పు కనుమలలోని అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం అడవుల అభివృద్ధిపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 1,513 జన్యు వనరులను గుర్తించి డాక్యుమెంట్ చేయడమే కాకుండా, 15,000 కంటే ఎక్కువ చెట్లపై క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించారు. దీనికి తోడు భవిష్యత్తు తరాల కోసం ఈ అరుదైన జాతిని కాపాడేందుకు, ఒక ప్రత్యేకమైన 'జాతీయ ఎర్రచందనం ఫీల్డ్ జీన్ బ్యాంక్'ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇదిలా ఉండగా పరిశోధనా రంగంలో కూడా ఎర్రచందనం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఐసీఎఫ్‌ఆర్‌ఈ, సీఎస్‌ఐఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో ఎర్రచందనం నుండి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్రచందనం బెరడు,హార్ట్‌వుడ్‌తో తయారైన “రాయలసీమ రెడ్ సాండర్స్" పేరుతో సబ్బును ట్రేడ్‌మార్క్ చేయగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 'రాయల్ రెడ్ లిప్‌స్టిక్' వంటి సౌందర్య సాధనాలను కూడా శాస్త్రవేత్తలు రూపొందించారు. కేవలం కలపగానే కాకుండా, ఔషధ, సౌందర్య ఉత్పత్తుల ద్వారా ఎర్రచందనానికి ఆర్థిక విలువను పెంచి, అటు పర్యావరణాన్ని, ఇటు సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను పెంచుతుంది.

ఈ తాజా విడుదలతో దేశవ్యాప్తంగా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ఏబిఎస్) కింద చెల్లించిన మొత్తం రూ. 143 కోట్లను దాటింది. ఇప్పటివరకు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్ బిఏ) రెడ్‌సాండర్స్ సంరక్షణతో పాటు ప్రయోజన క్లెయిమర్ల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 104 కోట్లు విడుదల చేయగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి మరో రూ. 15 కోట్లు విడుదల చేసింది.