
ఎర్రచందనం భద్రతను బలోపేతం చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుపతి జిల్లా మంగళంలోని అటవీశాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించి పరిశీలించారు. ఎనిమిది గోడౌన్లలో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకుని, ఎ–బీ–సీ, నాన్ గ్రేడ్‌ల వారీగా ఉన్న దుంగల సమాచారం, రికార్డులను సమీక్షించారు.
ఎర్రచందనం దుంగల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రతి దుంగకు ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ విధానాలను అమలు చేయాలని ఆయన ఆదేశించారు. పట్టుబడిన దుంగ నుంచి విక్రయం వరకూ ప్రతి దుంగను సమగ్రంగా పర్యవేక్షించి, ఏ ఒక్కటి కూడా లెక్క తప్పకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ అవసరమని సూచించారు. అదనంగా స్మగ్లింగ్ నిరోధక చర్యలు, టాస్క్ ఫోర్స్ కార్యకలాపాలు, అటవీ సిబ్బంది కూంబింగ్ కార్యక్రమాలపై పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తరువాత మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. నాలుగు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణాన్ని పర్యటించి, అందులో రెండు కిలోమీటర్ల మేర కాలినడకన సాగి పలు వృక్షాలను సమీక్షించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు వంటి ముఖ్య జాతులతో పాటు శేషాచలం ప్రాంతంలో లభించే అరుదైన మొక్కల గురించి అటవీ అధికారులు వివరాలు అందించారు.
నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని వాచ్ టవర్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడినుంచి మొత్తం అటవీ పరిధిని పరిశీలించారు. వెలిగొండ–శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవ ప్రాంతం వంటి అంశాలపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కాసేపు కూర్చొని పరిసరాలను ఆసక్తిగా వీక్షించారు. అటవీ ప్రాంతాల పరిరక్షణ, అక్రమ రవాణా నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన అధికారులతో చర్చించారు.
