Let's talk: editor@tmv.in
ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు

ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు

Pinjari Chand
11 నవంబర్, 2025

ఎర్రకోట పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. భారీ శబ్దంతో రావడంతో అక్కడికి వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో మరణించిన వారి శరీర భాగాలు చెల్లచెదురుగా పడ్డాయి. పరిసరాలు భయానకంగా మారాయి. ఆ ప్రాంతమంతా హహ కారాలతో నిండిపోయింది. క్షతగాత్రులను భద్రతా దళాలు ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించాయి. రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సాయంత్రం బిజీగా ఉండే సమయంలో మెట్రో స్టేషన్‌ పరిసరాల్లో వందలాది మంది సంచరిస్తుండగా ఆకస్మికంగా భారీ శబ్దం వినిపించి, ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా పూర్తిగా దగ్ధమయ్యాయి. పది ఫైరింజిన్‌లు వెంటనే సంఘటన స్థలానికి చేరి మంటలు రాత్రి 7.29 గంటలకు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీసులు తెలిపాయి.

ప్రత్యక్ష సాక్ష్యుల మాటల్లో

రోడ్డుపై మానవ శరీర భాగాలు చిందర వందరగా పడ్డాయి. ఒక కారుపైన శవం పడి ఉంది అని తెలిపారు. మరో వీడియోలో రోడ్డుమీద శరీర భాగాలు స్పష్టంగా కనిపించాయి. సమీపంలోని వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు.

కారులో నుంచే విస్ఫోటం

గాయపడిన ఒక వ్యక్తి మాట్లాడుతూ నా ఆటో ముందు ఒక స్విఫ్ట్‌ కారు నిలిపి ఉంది. ఆ కారులో ఏదో పదార్థం ఉండి, ఒక్కసారిగా పేలిపోయిందని తెలిపాడు. మరొక సాక్షి నేను గురుద్వారాలో ఉన్నా, ఒక్కసారిగా భీకర శబ్దం వినిపించింది, భూకంపంలా అనిపించింది అని పేర్కొన్నాడు.

రంగంలోకి జాతీయ భద్రత సంస్థలు

విస్ఫోటన తీవ్రతకు వందల మీటర్ల దూరంలోని వాహనాలు చిధ్రమయ్యాయి. శబ్దం ఐటీవో వరకు వినిపించిందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ‌.ఏ.) బృందం చేరి ఆధారాలు సేకరిస్తోంది. ఘటన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. నగరమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. అలాగే దేశం అంతటా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఫోరెన్సిక్‌ బృందం (ఎఫ్‌.ఎస్‌.ఎల్‌)తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ‌.ఏ.) కూడా సంఘటనా స్థలానికి చేరి ఆధారాలు సేకరిస్తోంది. ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానం ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు.

ఫరీదాబాద్‌ కేసుతో సంబంధముందా?

ఇదే రోజు ఉదయం ఫరీదాబాద్‌లోని ధౌజ్‌ ప్రాంతంలో జమ్మూకు చెందిన వైద్యుడు డా. ముజమ్మిల్‌ గనాయ్‌ అద్దె ఇంటి నుంచి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్‌, భారీగా ఆయుధాలు, టైమర్లు స్వాధీనం కావడం ఈ ఘటనకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

‘వైట్‌కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌’ బహిర్గతం

హర్యానా, జమ్మూ-కాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లలో 15 రోజుల ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు వైద్యులు ఉన్నారు. వీరు జైషే మొహమ్మద్‌, అంసార్‌ ఘజ్వత్‌-ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థలతో అనుబంధంగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ అయినవారిలో లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు డా. షహీన్‌ కూడా ఉంది. ఆమె కారులో ఏకే-47 తుపాకీ లభించిందని, విచారణ కోసం ఆమెను విమానంలో శ్రీనగర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుండగా, అధికారులు ఈ దాడికి ఉగ్రవాద సంబంధం ఉన్న అవకాశాన్ని ఖండించలేమని వెల్లడించారు.

అమిత్‌ షా సీరియస్‌

ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీరియస్ గా స్పందించారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే ఆయన ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ టపన్‌ డేకా, ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సతీష్‌ గోల్చాలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి సంయుక్త దర్యాప్తును ఆదేశించారు. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ‌.ఏ.), జాతీయ భద్రతా గార్డ్‌ (ఎన్‌.ఎస్‌.జీ.), ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌.ఎస్‌.ఎల్‌), ఢిల్లీ పోలీసు విభాగాలు కలిసి సమన్వయంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సంబంధిత సంస్థలు పేలుడు స్వరూపం, కారణం, వాడిన పదార్థాలపై సమగ్ర నివేదికను అత్యంత త్వరగా సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.

రెడ్‌ఫోర్ట్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరే పేలుడు

ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సతీష్‌ గోల్చా

పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సతీష్‌ గోల్చా మీడియాతో మాట్లాడారు. సాయంత్రం సుమారు 6.52 గంటల సమయంలో ఒక నెమ్మదిగా కదిలే వాహనం ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగింది. ఆ వాహనంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ విస్ఫోటనం ప్రభావంతో సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కొంతమంది మరణించగా మరికొందరు గాయపడ్డారు అని ఆయన తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. హోంమంత్రి అమిత్‌ షా స్వయంగా ఈ ఘటనపై మాకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రతి అప్‌డేట్‌ను ఆయనకు తెలియజేస్తున్నామని గోల్చా చెప్పారు.

ప్రధాని మోడీ దిగ్ర్బాంతి

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితిని సమీక్షించారు. ఆయన హోంమంత్రి అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడి తాజా వివరాలను తెలుసుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనను కలచివేసే సంఘటనగా పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై సమగ్రంగా, వేగంగా దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ వర్గాలు ప్రజల్లో భయాందోళన రేకెత్తించే ఇలాంటి ఘటనలను తక్షణమే అరికట్టే చర్యలు తీసుకోవాలని సూచించాయి.