
ఎర్రకోట పేలుళ్లలో కీలక ఆధారాలు లభ్యం
ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఆత్మాహుతి కారుబాంబు దాడి దర్యాప్తులో మంగళవారం కీలకమైన ఆధారాలు లభించాయి. ఆత్మాహుతి దాడిలో మరణించిన డాక్టర్ ఉమర్-ఉన్-నబీ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను జమ్మూ–కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకుని, దాని నుంచి తీసిన డేటా భయంకరమైన వాస్తవాల్ని బయటపెట్టింది. పోలీసులు తెలిపిన ప్రకారం ఉమర్ తనే స్వయంగా తీసుకున్న ఒక వీడియోలో ఈ ఆత్మాహుతి దాడిని ‘షహాదత్ ఆపరేషన్’ గా పేర్కొంటూ, ఇలాంటి దాడులు మతపరంగా అత్యంత ప్రశంసనీయమైనవని తెలిపాడు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అన్నయ్య చెప్పిన నిజాలు
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించి 15 మంది మృతి చెందిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడుపుతున్న ఉమర్ సోదరుడు జహూర్ ఇల్లాహిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరిపిన తర్వాత కీలకమైన ఆధారాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఉమర్ అన్నయ్య, దర్యాప్తులో ప్రధాన లింక్ అయ్యాడు. ఉమర్ అక్టోబర్ 26–29 మధ్య కాశ్మీర్ లో ఉన్నప్పుడు ఈ మొబైల్‌ను అతని చేతికి ఇచ్చి నా గురించి ఏ వార్త వచ్చినా వెంటనే నీళ్లలో పడెయ్యి అని చెప్పాడని విచారణలో వెల్లడించాడు. మొదట అన్ని విషయాలు దాచి పెట్టిన ఇల్లాహీ తరువాత పోలీసుల ప్రశ్నల వర్షం ధాటికి నిజం ఒప్పుకున్నాడు. అతడు చూపిన ప్రదేశంలో ఫోన్ దొరికింది. ఫోన్ దెబ్బతిన్నప్పటికీ ఫోరెన్సిక్ టీమ్ కీలకమైన డేటాను బయటకు తీసింది.
అందులో ఉన్న డేటా ప్రకారం ఉమర్ ఐసిస్, అల్-ఖైదా వంటి ఉగ్ర సంస్థల ఆత్మాహుతి దాడుల వీడియోలను చూసి తీవ్రంగా రాడికలైజ్ అయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ను ప్రస్తుతం ఎన్ఐఏకు పంపించారు. ఇల్లాహీని కూడా త్వరలో ఎన్ఐఏ కస్టడీకి తీసుకోనున్నారు. 28 ఏళ్ల ఉమర్–ఉన్–నబీ పుల్వామాకు చెందిన డాక్టర్. ఈ మొత్తం గ్యాంగ్‌లో అత్యంత రాడికలైజ్ అయిన వ్యక్తి అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కాశ్మీర్ నుంచి హర్యానా, యూపీ వరకు ఈ నెట్‌వర్క్ విస్తరించినట్లు తేలింది. అతను డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ ధ్వంసమైన రోజున పెద్ద ఎత్తున వాహనాల్లో బాంబులు అమర్చి దేశంలో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక పోస్టర్‌తో మొదలైన దర్యాప్తు
అక్టోబర్ 19న శ్రీనగర్ బున్‌పోరాలో జైషే-మొహమ్మద్ పోస్టర్లు కనిపించడంతో మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు స్థానికులను అరెస్ట్ చేయగా, వారి విచారణతో మాజీ పారామెడిక్–ఇప్పుడేమో ఇమామ్‌గా పనిచేస్తున్న మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ను గుర్తించి, అదుపులోకి తీసుకుని వివరాలు అరా తీశారు. ఈ ఇర్ఫాన్– గానాయి–ఉమర్ ముగ్గురినీ తీవ్రవాదం వైపు మళ్లించింది ఇదేనని పోలీసులు చెబుతున్నారు.
టర్కీ ట్రిప్
ఇంకా దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఉమర్ 2021లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గానాయితో కలిసి టర్కీకి వెళ్లినప్పుడు, అక్కడ జైషే–మొహమ్మద్ ఓవర్ గ్రౌండ్ కార్యకర్తలను కలిశారని అనుమానం. తిరిగి వచ్చాక వీరు 360 కిలోల అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి కెమికల్స్‌ను పెద్ద మొత్తంలో సేకరించారు. వీటిలో చాలా భాగం ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ దగ్గర నిల్వ చేశారు.
భయపడే ముందస్తు దాడా?
శ్రీనగర్ పోలీసులు గానాయిని అరెస్ట్ చేసి పేలుడు పదార్థాలను సీజ్ చేసిన తర్వాత ఉమర్ భయపడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ భయమే రెడ్ ఫోర్ట్ వద్ద నవంబర్ 10న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడికి కారణమై ఉండొచ్చని అనుమానం.
