Let's talk: editor@tmv.in
ఎర్రకోట పేలుడు..పుల్వామా వైద్యుడి పనే

ఎర్రకోట పేలుడు..పుల్వామా వైద్యుడి పనే

Pinjari Chand
12 నవంబర్, 2025

దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భయానక పేలుడు ఉగ్రవాద దాడిగా బయటపడుతోంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్‌ ఉగ్రవాద నిరోధక చట్టం (ఉప), అలాగే ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో ఫరీదాబాద్‌లో ఇటీవల బట్టబయలైన ఉగ్ర మాడ్యూల్‌తో లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అత్యవసర సమీక్షా సమావేశం

ఉగ్ర పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం ఉదయం అత్యవసర భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ టపన్‌ డేకా, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీష్‌ గోల్చా, ఎన్‌ఐఏ డీజీ సదానంద్‌ వసంత్‌ డేట్, అలాగే జమ్మూకశ్మీర్‌ డీజీపీ నలిన్‌ ప్రభాత్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. పేలుడు ఘటనపై అన్ని ప్రధాన దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ ప్రారంభించాయి. రేపు ఉదయం భద్రతా సమీక్షా సమావేశం జరిపి అన్ని కోణాల్లో విశ్లేషిస్తామని అమిత్‌ షా తెలిపారు. బాధితులను ఎల్‌.ఎన్‌.జె.పి. ఆసుపత్రిలో పరామర్శించారు. సంఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ వెతికి పట్టుకోవాలని భద్రతా సంస్థలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

పేలుడు వెనుక డాక్టర్‌

పోలీసుల దర్యాప్తు ప్రకారం పేలుడు సంభవించిన హ్యుందాయ్‌ ఐ20 కారును పుల్వామా నివాసి, వైద్యుడు ఉమర్‌ మొహమ్మద్‌ నడిపినట్లు సీసీటీవీ దృశ్యాలు చెబుతున్నాయి. ఈయన ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌లో భాగమని పోలీసులు గుర్తించారు. ఆ మాడ్యూల్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలు, అమ్యూనిషన్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ మాడ్యూల్‌లోని మరో వైద్యుడు అరెస్టయిన నేపథ్యంలో తన అరెస్టు భయంతోనే ఉమర్‌ మొహమ్మద్‌ ఈ దాడి జరిపినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పేలుడు పదార్థాలు – భారీ లింకులు

ప్రాథమిక విశ్లేషణలో అమోనియం నైట్రేట్‌, ఇంధన నూనె, డిటోనేటర్లు వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే పదార్థం ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న 360 కిలోల ఇన్‌ఫ్లేమబుల్‌ మెటీరియల్‌లో కూడా ఉన్నట్టు తేలింది. ఇది రెండు ఘటనల మధ్య నేరుగా లింకులు ఉన్నట్టు సూచిస్తోంది.

మాస్క్‌ ధరించిన వ్యక్తి.. మూడు గంటలపాటు పార్కింగ్‌లో కారు

సీసీటీవీ ఫుటేజీలలో మాస్క్‌ ధరించిన వ్యక్తి కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పేలుడు సంభవించే ముందు కారు మూడు గంటల పాటు సమీప పార్కింగ్‌లో నిలిపి ఉంచినట్టు ఫుటేజీ చెబుతోంది. ఈ దిశగా పోలీసులు అనేక పార్కింగ్‌ స్థలాల సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పడుతున్నారు.

ఢిల్లీలో కట్టుదిట్టమైన నిఘా

పేలుడు అనంతరం ఢిల్లీ అంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ టెర్మినల్స్‌లో కఠిన భద్రతా చర్యలు అమల్లోకి తెచ్చారు. దర్యాగంజ్‌, పహార్గంజ్‌ ప్రాంతాల్లో హోటళ్లు, అతిథి గృహాలను సోదా చేసి అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రైవేట్‌, కమర్షియల్‌ వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ట్రాఫిక్‌ పరిమితులు – మెట్రో స్టేషన్‌ మూసివేత

పేలుడు చోటు చేసుకున్న రెడ్‌ ఫోర్ట్‌ మెట్రో స్టేషన్‌ ను తాత్కాలికంగా మూసివేశారు. ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు నేతాజీ సుభాష్‌ మార్గ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సిందిగా పౌరులకు సూచించారు.

డీఎన్‌ఏ నమూనా సేకరణ

పేలుడు స్థలంలో లభించిన అవశేషాలను గుర్తించేందుకు జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఉమర్‌ నబీ తల్లికి చెందిన డీఎన్‌ఏ నమూనా తీసుకున్నారు. పేలుడు చోటుచేసుకున్న కారులో దొరికిన శరీర భాగాలను ఈ నమూనాతో పోల్చి పరిశీలిస్తామని శ్రీనగర్‌లో ఒక అధికారి వెల్లడించారు.

కేసు ఎన్ఐఏకి బదిలీ

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో దేశ భద్రతా సంస్థల ప్రధానాధికారులు పాల్గొన్నారు.

ఈ మాడ్యూల్‌లో ముగ్గురు వైద్యులు

ఫరీదాబాద్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల మీదుగా విస్తరించిన “వైట్‌ కాలర్‌” ఉగ్ర మాడ్యూల్‌ను సోమవారం పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మాడ్యూల్‌లో జైష్‌–ఇ–మొహమ్మద్‌, అంసార్‌ ఘజ్వతుల్‌ హింద్‌ ఉగ్ర సంస్థల పాత్ర ఉందని తేలింది. ఈ మాడ్యూల్‌లో భాగంగా డా. ముజమ్మిల్‌ గనాయ్‌, డా. షాహీన్‌ సయీద్‌, ఇద్దరూ ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీకి చెందినవారిని అరెస్ట్‌ చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో 360 కిలోల అమోనియం నైట్రేట్‌ స్వాధీనం చేసుకున్నారు.షాహీన్‌ సయీద్‌ జైష్‌ సంస్థ మహిళా విభాగం ‘జమాత్‌-ఉల్‌-మొమినాత్‌’కు నేతృత్వం వహిస్తునట్టు అధికారులు గుర్తించారు.

కారు నడిపింది డాక్టర్‌ ఉమర్‌

పేలుళ్లకు వాడిన కారును నడిపిన వ్యక్తి పుల్వామా జిల్లా లేత్‌పోరాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ నబీ అని పోలీసులు గుర్తించారు. ఈయనకు హర్యానా ఫరీదాబాద్‌లో బట్టబయలైన ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఉమర్‌ కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసేవాడు. సహచర వైద్యులు అరెస్టైన నేపథ్యంలో తాను కూడా చిక్కిపోతానని భావించి భయంతో ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. లేత్‌పోరాకు చెందిన తారిక్‌ అనే వ్యక్తి ఈ హ్యుందాయ్‌ ఐ20 కారును ఉమర్‌కు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. తారిక్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని కూడా అనుమానిస్తున్నారు.

మరణించిన వారిలో ఇద్దరి గుర్తింపు

పేలుడు ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. అశోక్‌ కుమార్‌ (34), ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లా కు చెందినవాడిగా గుర్తించారు. అలాగే అమర్‌ కటారియా (35), ఢిల్లీ నివాసి అని తెలిపారు. ఇతర మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం మరణించిన వారి వయస్సు 28 నుంచి 58 సంవత్సరాల మధ్యగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన 20 మందిలో 12 మంది ఢిల్లీకి చెందినవారు కాగా, మిగతా ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రాంతాలకు చెందినవారని తెలిపారు.

ఉగ్రవాద కుట్రా.. ఆత్మాహుతి దాడా?

పేలుడు విధానం, పదార్థాల రకం, టైమింగ్‌ దృష్ట్యా ఇది ఆత్మాహుతి దాడి లేదా ఉగ్ర కుట్రలో భాగమా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఫైనల్‌ రిపోర్టులు త్వరలో రానున్నాయని అధికారులు తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటన

ఢిల్లీలో జరిగిన ఈ దురదృష్టకర ఘటన మొత్తం నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ క్లిష్ట సమయంలో ప్రాణాలను కోల్పోయిన వారందరి కుటుంబాలతో పాటు గాయపడిన వారిపట్ల కూడా ఢిల్లీ ప్రభుత్వానికి ప్రగాఢ సానుభూతి ఉంది. ప్రతి బాధిత కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా అందజేస్తామని తెలిపింది. గాయపడిన వారందరికీ సరైన, మెరుగైన వైద్యం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపింది.

ఎర్రకోట పేలుడు..పుల్వామా వైద్యుడి పనే - Tholi Paluku