
ఎర్నాకుళం, బెంగుళూరు మధ్య వందేభారత్
భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రవాణా సేవలను వేగవంతం చేయడంలో మరో అడుగు ముందుకేసింది. దక్షిణ భారతదేశ ప్రయాణికులకు శుభవార్తను అందించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎర్నాకులం – బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. కేరళ రాష్ర్ట బీజేపీ నాయకులతో మంత్రి వర్చువల్ సమావేశంలో పాల్గోన్నారు. కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రతిపాదన మేరకు వందేభారత్ ను ప్రకటించామని కేంద్రమంత్రి ఎక్స్ లో తెలిపారు. ఈ కొత్త మార్గం పట్ల ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయవంతంగా దేశంలోని ఇతర మార్గాల్లో సేవలందిస్తున్న వందే భారత్, ఇప్పుడు దక్షిణ భారతంలో మరో కీలక పట్టణాలను కలిపేందుకు సిద్ధమైంది.
కేరళకు ప్రత్యేక రైళ్లు
రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని, కేరళలో ప్రయాణ సౌలభ్యం కోసం 488 ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. దీని వల్ల పండుగ సమయంలో పెద్దఎత్తున ప్రయాణించే ప్రజలకు ఈ విషయం ఉపశమనాన్ని కలిగించనుంది.
దేశవ్యాప్తంగా రైల్వే విస్తరణకు భారీ ప్రాజెక్టులు
ఇటీవలి కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి 894 కిలోమీటర్ల రైలు మార్గాన్ని కవర్ చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో కీలకమైనవి. వర్ధా – భుసావల్ (314 కిమీ, ₹9,197 కోట్లు) మధ్య మూడవ, నాల్గవ లైన్ల నిర్మాణం, అలాగే మొత్తం 613 వంతెనలు నిర్మించనుంది. ఇందులో 4 ముఖ్య, 72 ప్రధాన, 537 చిన్న వంతెనలు ఉన్నాయి. గోండియా – డోంగర్గఢ్ (84 కిమీ, ₹2,223 కోట్లు) మధ్య నాల్గవ లైన్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది.
ప్రాజెక్టు పూర్తైతే ప్రతి సంవత్సరం 23 కోట్ల కిలోల CO₂ ఉద్గారాల తగ్గింపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ కీలక భారత రైల్వే కారిడార్‌లను బలోపేతం చేస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందిస్తాయని మంత్రి వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు దేశపు రవాణా రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. ప్రత్యేకించి వందే భారత్ లాంటి హై-స్పీడ్ రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి. ఎర్నాకులం – బెంగళూరు మధ్య వందే భారత్ ప్రారంభంకానుడడంతో కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయాణించే ప్రయాణికులకు పెద్ద మొత్తంలో ప్రయోజనం కలిగించనుంది. గతంలో కాసరగోడ్, తిరువనంతపురం మధ్య మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కేంద్రం 2023 ఏప్రిల్ 25 న ప్రారంభించింది. అలాగే మంగుళూరు–తిరువనంతపురం మధ్య 2024లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించింది.
