
ఎర్త్ అవర్ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిలిచిపోయిన విద్యుత్ దీపాలు
పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించే అంతర్జాతీయ ఉద్యమం 'ఎర్త్ అవర్ 2026' లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం శనివారం రాత్రి భాగస్వామ్యమైంది. ఈ సందర్భంగా సచివాలయంలోని విద్యుత్ దీపాలను గంట సేపు పూర్తిగా ఆపివేసి పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
నిన్న రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు సచివాలయ ప్రధాన భవనంతో పాటు, దాని పరిధిలోని అన్ని కార్యాలయ బ్లాకులు, గదులు, హాళ్లలో లైట్లను పూర్తిగా ఆపివేశారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చు అనే సందేశాన్ని ప్రభుత్వం ఈ చర్య ద్వారా బలంగా వినిపించింది. సుస్థిరత, విద్యుత్ శక్తి సంరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న పట్టుదలకు ఇది నిదర్శనంగా నిలిచింది.
గివ్ఆన్ అవర్ ఫర్ఎర్త్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ గ్లోబల్ ఇనిషియేటివ్, పర్యావరణాన్ని రక్షించే దిశగా సామూహిక చర్యలను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. బాధ్యతాయుతమైన జీవనశైలి, పర్యావరణ సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ ప్రచారం నిన్న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడింది. చిన్న మార్పుతోనే భూగోళాన్ని గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడుకోవచ్చని ఈ ఎర్త్ అవర్ మనకు గుర్తు చేస్తోంది.
