Let's talk: editor@tmv.in
ఎరువుల కొరతపై రైతుల్లో ఆందోళన

ఎరువుల కొరతపై రైతుల్లో ఆందోళన

Pinjari Chand
29 మార్చి, 2026

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత వ్యవసాయ రంగంపై పడుతుండగా, ఎరువుల సరఫరా అంతరాయం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గే అవకాశం, ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఎరువుల సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతానికి చెందిన రైతులు కోరుతున్నారు. గత రబీ, ఖరీఫ్ సీజన్లలో ఎదురైన సమస్యలు, బ్లాక్ మార్కెట్ పరిస్థితులను వారు గుర్తుచేస్తున్నారు. రైతు కపిల్ పాటిదార్ మాట్లాడుతూ గత రబీ సీజన్‌లో డీఏపీ దొరకకపోవడంతో, ఎన్‌పీకే ఎరువులను బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఎరువు దొరకడం చాలా కష్టం అయింది. ఇది బంగారం, వెండి లాగా విలువైనదైందని తెలిపారు. మరో రైతు కైలాష్ నారాయణ్ పాటిదార్ మాట్లాడుతూ ఇలాంటి కొరతలు ముందు కూడా వచ్చాయి. కానీ యుద్ధం కొనసాగితే పరిస్థితి మరింత విషమిస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడే ఈ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంటుందన్నారు. చతుర్ నారాయణ్ పాటిదార్ మాట్లాడుతూ ‘పొలాల్లో వరి విత్తనాల విత్తే సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో భారీగా ఎరువులు అవసరం. కానీ ఇప్పటికే కొరత ఉంది. విదేశాల నుంచి సరఫరా ఆగిపోతే రైతులు ఎలా సాగు చేస్తారు? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

త్వరలోనే ఎరువుల కొరత ప్రభావం పడుతుంది

వ్యవసాయ నిపుణుడు యోగేష్ ద్వివేది మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారతదేశానికి చమురు, ఎరువుల దిగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎల్పీజీ ట్యాంకర్ల రవాణాకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఎరువుల సరఫరా నౌకలు నిలిచిపోయాయి. అయితే ఫిబ్రవరిలో కొంత స్టాక్ సిద్ధం చేసుకుందని చెప్పారు. ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా త్వరలోనే బయటపడుతుందని ఆయన హెచ్చరించారు. యూరియా ధర టన్నుకు 450 డాలర్ల నుంచి 600 డాలర్లకు పెరిగిందని, డీఏపీ ధర కూడా పెరిగిందని తెలిపారు. భారతదేశంలో ఎరువుల తయారీ ప్లాంట్లు ఉన్నప్పటికీ, వాటికి అవసరమైన ముడి పదార్థాలు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతాయి. హోర్ముజ్ సముద్ర మార్గంలో అంతరాయం ఏర్పడడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రిసెల్‌ రేటింగ్స్‌ నివేదిక ప్రకారం, ఈ సరఫరా అంతరాయాల వల్ల దేశీయంగా ఎరువుల ఉత్పత్తి 10-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో కంపెనీలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ సబ్సిడీ భారం రూ.20,000 నుంచి రూ.25,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులు కొనసాగితే రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.