
ఎర్గోగాన్ తీరు మారదా?
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ సమస్యను లేవనెత్తారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఆయన ఇండియా-పాకిస్తాన్ మధ్య శాంతి కొనసాగడం సంతోషకరమని చెప్పినా, దీర్ఘకాలిక శాంతి కోసం కశ్మీర్ సమస్యను పరిష్కరించడం తప్పనిసరి అని కామెంట్ చేశారు. గత ఏప్రిల్‌లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా.. ఆ తర్వాత వచ్చిన కాల్పుల విరమణ మంచి పరిణామమని చెప్పారు. అయితే కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, సంభాషణ, అక్కడి ప్రజల ఆకాంక్షలు ఆధారంగా పరిష్కారం రావాలని ఎర్డోగాన్ వాదించారు.
ఎర్డోగాన్ తరచూ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల్లో లేవనెత్తడం వెనుక కేవలం 'మానవతా' కోణమే కాదు, అనేక రాజకీయ-రాజనీతిక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన భారత్ టార్గెట్‌గా వ్యవహరించడం వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. మొదటిది పాకిస్తాన్‌తో మైత్రి అయితే రెండోది ఇస్లామిక్ ప్రపంచంలో లీడర్‌షిప్ దక్కించుకోవాలనే ఆకాంక్ష. ఇక మూడోది అంతర్గత రాజకీయ లాభాలు.
నిజానికి టర్కీకి పాకిస్తాన్‌తో పాత మైత్రి ఉంది. రక్షణ రంగంలోనూ, వాణిజ్యంలోనూ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ తరచూ టర్కీకి మద్దతు ఇస్తుంది. ఉదాహరణకు, 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి సహా అనేక వేదికల్లో భారత్‌ను టార్గెట్ చేసింది. అప్పట్లో ఎర్డోగాన్ బహిరంగంగా పాకిస్తాన్ పక్షాన నిలబడ్డారు. టర్కీ పార్లమెంట్‌లోనూ కశ్మీర్ అంశంపై తీర్మానం ప్రవేశపెట్టారు. దీని వల్ల పాకిస్తాన్‌తో టర్కీ బంధం మరింత బలపడింది.
ఇటు టర్కీ చాలా కాలంగా ఇస్లామిక్ సహకార సంస్థలో పెద్ద పాత్ర పోషించాలని చూస్తోంది. ఈ క్రమంలో ముస్లింలకు సంబంధించిన సమస్యలపై తాను 'గళమెత్తే నాయకుడు' అని చూపించుకోవాలనేది ఎర్డోగాన్ లక్ష్యం. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ వేదికలో ప్రస్తావించడం ద్వారా ఆయన ముస్లింల సమస్యల పట్ల తాను దృఢంగా నిలుస్తున్నానని చూపించాలనుకుంటున్నారు. 2020లో మలేషియాలో జరిగిన ఒక ఇస్లామిక్ దేశాల కాన్ఫరెన్స్‌లోనూ ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అప్పట్లో సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలు వెనుకడుగు వేసినా, టర్కీ మాత్రం పాకిస్తాన్‌తో కలిసి గళమెత్తింది. ఇక భారత్-టర్కీ సంబంధాలు ఎప్పటికప్పుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలతో దెబ్బతింటున్నాయి. 2017లో ఆయన భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా కశ్మీర్ సమస్యను సంభాషణ ద్వారానే పరిష్కరించాలంటూ వ్యాఖ్యానించారు. ఆ తరువాత 2019లో UNGAలో, 2020లో కూడా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్‌ను అసహనానికి గురిచేశారు. భారత్ ప్రతిసారీ ఈ వ్యాఖ్యలను 'అంతర్గత వ్యవహారాల్లో జోక్యం'గా ఖండిస్తోంది.
మరోవైపు టర్కీ లోపల ఎర్డోగాన్‌కు ఇస్లామిక్ వర్గాల మద్దతు కీలకం. కశ్మీర్ అంశాన్ని లేవనెట్టి, ఆయన తనను ఇస్లామిక్ ప్రపంచానికి 'రక్షకుడిగా' చూపించుకోవడం కూడా ఆయన వ్యూహంలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలతో టర్కీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అసంతృప్తిని మతపరమైన అంశాల ద్వారా మళ్లించే ప్రయత్నంగా కూడా దీన్ని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఎర్డోగాన్ వ్యాఖ్యలు కేవలం కశ్మీర్‌పై నిరసనగా కాకుండా.. పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం, ఇస్లామిక్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చూపించడం, దేశీయ రాజకీయాల్లో లాభం పొందడం అనే మూడు కోణాల్లోనే చూడాల్సి ఉంది.
