
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించలేరా?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఉన్న 18 శాతం జీఎస్టీని ఎందుకు తగ్గించకూడదని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సామాన్యులకు ఇవి అందుబాటు ధరల్లో ఉండాలంటే పన్ను తగ్గించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ.. ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫైయర్ల ధరలు రూ.10,000 నుంచి రూ.60,000 వరకు ఉన్నాయని, ఇవి సామాన్యులకు అందని స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏ విధానంలో అయినా సరే, సామాన్యుడు వీటిని కొనుగోలు చేసేలా ధరలను తగ్గించే మార్గాన్ని అన్వేషించాలని కేంద్రానికి సూచించారు.
కేంద్రం తరఫున హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్ (ASG) ఎన్. వెంకటరామన్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పన్ను తగ్గింపుపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇది దేశవ్యాప్త పన్ను విధానం కావడంతో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంగీకారం తప్పనిసరని, కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని కౌన్సిల్ మాత్రమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అలాగే, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ ప్రక్రియ భౌతికంగానే జరగాల్సి ఉంటుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అది సాధ్యం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ ను కేంద్రం తరఫున దాఖలు చేస్తామని ఆయన వెల్లడించింది. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, కేంద్రానికి 10 రోజుల గడువు ఇస్తూ తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌ను అడ్వకేట్ కపిల్ మదన్ దాఖలు చేశారు. ఢిల్లీలో గాలి కాలుష్యం “తీవ్ర అత్యవసర పరిస్థితి”గా మారిందని, ఇలాంటి సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్లను లగ్జరీ వస్తువులుగా చూడటం సరైంది కాదని ఆయన వాదించారు. వీటిని “మెడికల్ డివైసెస్”గా గుర్తించి జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరారు. ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. 'ఈ సమస్య ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోంది, అందరూ ఆందోళన చెందుతున్న అంశం ఇది' అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. 'ఖచ్చితంగా మైలార్డ్స్, మాకూ దీనిపై అంతే ఆందోళన ఉంది' అని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక మంత్రితో సహా ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిగాయని, గురువారం అత్యవసర సమావేశం కూడా నిర్వహించామని కోర్టుకు వివరించారు.
అయితే, ఈ పిటిషన్‌పై కేంద్రం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇందులో జీఎస్టీతో సంబంధం లేని అంశాలు కూడా ఉన్నాయని, ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రతివాదిగా చేర్చకుండానే ఆ శాఖకు సంబంధించిన ఆదేశాలు కోరడం సరికాదని పేర్కొంది. అంతేకాకుండా, ఈ పిటిషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను తెలుసుకోవాల్సి ఉందని.. ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్‌లో ఎవరైనా 'ఏకాధిపత్యం' కోసం ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని కేంద్రం వాదించింది
దీనిపై పిటిషనర్ కపిల్ మదన్ స్పందిస్తూ.. ఫిబ్రవరి 2020లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం శ్వాసకోశ సంబంధిత పరికరాలన్నీ 'వైద్య పరికరాల' పరిధిలోకి వస్తాయని కోర్టుకు వివరించారు. ఈ నిబంధనల ప్రకారం ఎయిర్ ప్యూరిఫైయర్లను కూడా వైద్య పరికరాలుగానే పరిగణించాలని, ప్రస్తుతం వాటిని తప్పుడు జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచి అధిక పన్ను వసూలు చేస్తున్నారని ఆయన వాదించారు. కోర్టు మాత్రం, కేంద్రం పూర్తి సమాధానం ఇవ్వకుండా ఇప్పుడే నిర్ణయం చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ అంశం లోతైన చర్చకు అవసరమని పేర్కొంది.
ఇదివరకే, డిసెంబర్ 24న ఢిల్లీ హైకోర్టు జీఎస్టీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమై ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు లేదా రద్దుపై ఆలోచించాలని ఆదేశించింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ‘వెరీ పూర్’ స్థాయిలో ఉన్న ఈ అత్యవసర పరిస్థితిలో కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న గాలి కాలుష్యం నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గింపు అంశంపై కోర్టు ఇచ్చే తుది నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో కీలకంగా మారనుంది.
