Let's talk: editor@tmv.in
ఎయిర్‌ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా

ఎయిర్‌ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

ఎయిర్‌‌ ఇండియా ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సీఈవో) క్యాంప్‌బెల్‌ విల్సన్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేసినట్లు వర్గాలు తెలిపాయి. విల్సన్‌ను 2022లో ఐదేళ్ల కాలానికి టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన పదవీకాలం 2027 జూలై వరకు కొనసాగాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో ముందుగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. విమానయాన రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన విల్సన్‌ పూర్తి సేవలు విమానయాన సంస్థలు తక్కువ ఖర్చుతో పనిచేసే ఎయిర్‌లైన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎయిర్‌ ఇండియాలో చేరకముందు ఆయన స్కూట్‌ అనే తక్కువ ఖర్చుతో సేవలందించే సంస్థకు సీఈవోగా పనిచేశారు. ఈ సంస్థ పూర్తిగా సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ.

సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌ నుంచి కెరీర్‌‌ ప్రారంభం

విల్సన్‌ 1996లో న్యూజిలాండ్‌లో సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌ లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం కెనడా, హాంకాంగ్‌, జపాన్‌లలో పలు బాధ్యతలు నిర్వహించారు. 2011లో సింగపూర్‌కు తిరిగి వెళ్లి స్కూట్‌ సంస్థ స్థాపక సీఈవోగా బాధ్యతలు చేపట్టి 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌)గా పనిచేశారు. ఆ బాధ్యతల్లో ధరలు, పంపిణీ, ఈ–కామర్స్‌, బ్రాండ్‌, మార్కెటింగ్‌, గ్లోబల్‌ సేల్స్‌ వంటి విభాగాలను పర్యవేక్షించారు. 2020 ఏప్రిల్‌లో మళ్లీ స్కూట్‌ సీఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. విల్సన్‌ న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్‌‌బరీ నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫస్ట్‌ క్లాస్‌ ఆనర్స్‌) పట్టా పొందారు.

ఎయిర్‌ ఇండియా తదుపరి సీఈవో ఎవరు? చర్చలో పలువురి పేర్లు

ఎయిర్‌‌ ఇండియా సీఈవోగా ఉన్న క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఎవరన్నదానిపై విమానయాన రంగంలో చర్చలు మొదలయ్యాయి. అయితే కొత్త సీఈవో నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ పేర్లు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నటరాజన్‌ చంద్రశేఖరన్‌ పేరు ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌ చైర్మన్‌గా ఉన్న ఆయన ఇప్పటికే ఎయిర్‌ ఇండియా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలికంగా ‘ఎగ్జిక్యూటివ్ చైర్మన్’ మోడల్‌లో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు వినయ్‌దుబే పేరు కూడా వినిపిస్తోంది. అకాశ ఎయిర్‌‌ స్థాపక సీఈవోగా పనిచేసిన ఆయన, అంతకుముందు డెల్టా ఎయిర్‌‌ లైన్స్‌, జెట్‌ ఎయిర్‌‌వేస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. భారతీయ విమానయాన రంగంపై మంచి అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.

అలాగే లెస్లీతాంగ్‌ పేరు కూడా చర్చలో ఉంది. ప్రస్తుతం స్కూట్‌ సీఈవోగా ఉన్న ఆయన, ఈ సంస్థ సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన తక్కువ ఖర్చు విమానయాన సంస్థ. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఇండియాలో వాటా ఉండటంతో ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఇండిగో సీఈవోగా ఉన్న పీటర్‌‌ ఎల్‌బర్స్‌ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌‌లైన్స్‌ను విజయవంతంగా నడిపిన అనుభవం ఆయనకు ఉంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన మేనేజర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది.

ఇక అడ్రియన్‌ న్యూహౌసెర్‌‌ పేరు కూడా పరిశ్రమలో చర్చకు వచ్చింది. ప్రస్తుతం అబ్రా గ్రూప్‌ సీఈవోగా ఉన్న ఆయన, అవింకా, జీవోఎల్‌ లిన్హాస్‌ ఐరియాస్‌ వంటి విమానయాన సంస్థల పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా, కొత్త సీఈవో నియామకం జరిగే వరకు క్యాంప్‌బెల్‌ విల్సన్‌ నోటిస్‌ పీరియడ్‌లో కొనసాగవచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి.