Let's talk: editor@tmv.in
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ బాధ్యుడు కాదు: సుప్రీంకోర్టు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ బాధ్యుడు కాదు: సుప్రీంకోర్టు

Shaik Mohammad Shaffee
8 నవంబర్, 2025

అహ్మదాబాద్‌లో 260 మంది మరణించిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని "చాలా దురదృష్టకరం"గా సుప్రీంకోర్టు శుక్రవారం అభివర్ణించింది. ఈ ప్రమాదానికి పైలట్‌ను ఎవరూ నిందించలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (ప్రధాన పైలట్) తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహా ఇతరులకు నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. లండన్ వెళ్లే విమానానికి పైలట్-ఇన్-కమాండ్‌గా ఉన్న తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల భారాన్ని తొలగించాలని 91 ఏళ్ల పుష్కరాజ్ సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం సానుభూతి వ్యక్తం చేసింది. "ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. మీ కుమారుడిపై నింద మోపబడుతోందనే భారాన్ని మీరు మోయకూడదు. అతడిని ఎవరూ నిందించలేరు" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

"ఈ ప్రమాదానికి పైలట్ తప్పే కారణమని భారతదేశంలో ఎవరూ విశ్వసించడం లేదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమిక విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) నివేదికలో కూడా పైలట్‌ పై ఎలాంటి ఆరోపణలు లేవని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. ఆ నివేదిక కేవలం ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణను మాత్రమే నమోదు చేసిందని తెలిపారు.

స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ఏఏఐబీ నిర్వహిస్తున్న దర్యాప్తు స్వతంత్రంగా లేదని పేర్కొన్నారు. ప్రమాదానికి పైలట్‌పై అన్యాయంగా నింద పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విమానయాన రంగంలోని స్వతంత్ర నిపుణులతో కూడిన కమిటీ ద్వారా న్యాయస్థానం పర్యవేక్షణలో నిష్పాక్షికమైన, పారదర్శకమైన, సాంకేతికంగా పటిష్టమైన దర్యాప్తు జరపాలని పుష్కరాజ్ సభర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ తమ పిటిషన్‌లో కోరారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వ్యాసం ప్రచురించి, ప్రభుత్వ వర్గాల ఆధారంగా పైలట్ తప్పిదం అని సూచించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మాసనం "విదేశీ పత్రికల నివేదికలు మాకు సంబంధం లేదు. అది అసహజమైన రిపోర్టింగ్. భారతదేశంలో ఎవరూ పైలట్ తప్పు అని అనుకోవడం లేదు" అని తేల్చి చెప్పింది.

పిటిషన్‌లో లేవనెత్తిన సాంకేతిక అంశాలు

ప్రస్తుతం డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న దర్యాప్తు, జూలై 12 నాటి ప్రాథమిక నివేదిక 'లోపభూయిష్టంగా' ఉందని పిటిషన్ ఆరోపించింది. ప్రమాదానికి పైలట్ తప్పిదాన్ని ఆపాదించడం అసమంజసం అని, ఇది రాజ్యాంగంలోని అధికరణలు 14, 21ని ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రాథమిక నివేదికలో రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ) యాక్టివేట్ అవ్వడం, బోయింగ్ కామన్ కోర్ సిస్టమ్ వైఫల్యం వంటి అంశాలను పరిశీలించకపోవడం, అలాగే బహుళ భద్రతా వ్యవస్థలు ఒకేసారి విఫలమవ్వడాన్ని సమీక్షించకపోవడం ఇవన్నీ మానవ తప్పిదం కంటే సాంకేతిక వైఫల్యాన్ని సూచిస్తాయని పిటిషన్‌లో పేర్కొంది.

“పైలట్ చర్యల కంటే ముందే ఆర్ఏటీ యాక్టివేట్ అయినట్లు రికార్డు ఉన్నప్పటికీ, దాన్ని నివేదిక పరిగణించలేదు. ఇది విచారణలో లోపం, నిజాలను దాచడం వంటివి సూచిస్తోంది” అని పిటిషన్ పేర్కొంది.

అలాగే బోయింగ్ 787 సీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ లేదా డిజైన్ లోపాలను విచారణ చేయకపోవడం, స్వతంత్ర ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయకపోవడం అంతర్జాతీయ చికాగో కన్వెన్షన్ ప్రకారం అవసరమైన సాంకేతిక విచారణ ప్రమాణాలను ఉల్లంఘించడం అవుతుందని పిటిషన్ స్పష్టం చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 10కు వాయిదా వేసింది.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ బాధ్యుడు కాదు: సుప్రీంకోర్టు - Tholi Paluku