Let's talk: editor@tmv.in
ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ

Pinjari Chand
14 నవంబర్, 2025

అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్‌ఇండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ (ఐసీఏఓ) మార్గదర్శకాల ప్రకారమే సాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని గురువారం సుప్రీంకోర్టులో వెల్లడించారు. ప్రమాదంలో విదేశీ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని, అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విచారణ జరగాల్సిందేనని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం, మృతిచెందిన పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరరాజ్ సబర్వాల్ ‘సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ వాదనలు విన్నది. వీరు ఈ కేసులో కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా 171 విమానం కూలిపోయిన ఘటనలో 260 మంది మృతి చెందిన అహ్మదాబాద్ ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో కేంద్రం స్పందన కోరింది .

సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ ప్రమాదంపై కోర్టు-స్వతంత్ర దర్యాప్తును కోరుతూ మరో పిటిషనర్ పుష్కర్‌రాజ్ సభర్వాల్ కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంత పెద్ద ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు స్వతంత్ర విచారణ తప్పనిసరని వారు పేర్కొన్నారు. అయితే కేంద్రం మాత్రం అంతర్జాతీయ విధానమే అనుసరిస్తోందని తుషార్ మెహతా పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి బగ్చీ స్పష్టం చేస్తూ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక దోషులను నిర్ధారించడానికి కాదని, ప్రమాదానికి కారణమైన అంశాలను స్పష్టం చేయడానికే అని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇప్పటికీ తమ లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సూచించగా, కోర్టు ఆ సమాధానం వెంటనే సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర సమాధానం తర్వాత పిటిషనర్లు తమ ప్రతివాద పత్రాలు దాఖలు చేయాలని కూడా ఆదేశిస్తూ, విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసింది.

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ - Tholi Paluku