
ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్యకు గురయ్యింది. విమానం ల్యాండింగ్ కోసం ఎత్తు తగ్గిస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) అకస్మాత్తుగా తెరుచుకుంది. అయితే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటన ఏఐ117 విమానంలో చోటు చేసుకుంది. యూకేలోని బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానం ర్యామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయడం ప్రారంభించినట్లు గుర్తించిన సిబ్బంది, వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిరిండియా వివరణ
తాజా ఘటనపై ఎయిరిండియా సంస్థ స్పందించింది. "అమృత్‌సర్-బర్మింగ్‌హామ్ ఫ్లైట్ ఏఐ117 ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా ర్యాట్ బయటకు రావడాన్ని సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో విమానంలోని ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. విమానం సురక్షితంగా ల్యాండైంది. తదుపరి తనిఖీల కోసం విమానాన్ని నిలిపివేశారు. దీని కారణంగా బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఏఐ114 సర్వీసును రద్దు చేసి, ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం" అని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. తమకు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని ఎయిరిండియా స్పష్టం చేసింది.
ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియాకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కొన్ని క్షణాల ముందు కూడా దానికి ఉన్న ర్యాట్ బయటకు వచ్చి పనిచేయడం మొదలుపెట్టినట్లు వీడియోల ద్వారా తెలిసింది. నాడు ఆ సంఘటనకు కారణం విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవడం అని ప్రాథమిక నివేదికలో తేలింది.
ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) అంటే ఏమిటి?
ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) అనేది విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక చిన్న, విండ్‌మిల్ (గాలిమర) లాంటి పరికరం. సాధారణ పరిస్థితుల్లో ఇది విమానం రెక్క లేదా ప్రధాన బాడీలో లోపలికి ముడుచుకుని దాగి ఉంటుంది. విమానం ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంజిన్ వైఫల్యం కారణంగా ప్రధాన విద్యుత్ లేదా హైడ్రాలిక్ శక్తి పూర్తిగా, పాక్షికంగా ఆగిపోయినప్పుడు మాత్రమే ఇది స్వయంచాలకంగా లేదా సిబ్బంది ద్వారా బయటకు వస్తుంది.
ఇది బయటకు వచ్చిన తర్వాత విమానం వేగాన్ని (గాలిని) ఉపయోగించుకుని తిరుగుతుంది. ఈ విధంగా తిరగడం ద్వారా అత్యవసర విద్యుత్‌ను లేదా హైడ్రాలిక్ పీడనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని నియంత్రించడానికి, సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అవసరమైన కీలకమైన ఫ్లైట్ సిస్టమ్స్, ప్రాథమిక ఫ్లైట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పరికరాలు), నియంత్రణ వ్యవస్థలకు శక్తిని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒక్కమాటలో చెప్పాలంటే, ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది విమానానికి సంబంధించిన బ్యాకప్ పవర్ జనరేటర్ లాంటిది. ప్రధాన శక్తి వనరులు విఫలమైనప్పుడు విమానాన్ని నియంత్రణలో ఉంచడానికి ఇది సహాయపడుతుంది.
