
ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ డెమాన్‌స్ట్రేటర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను గరిష్టంగా మూడేళ్ల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ట్రామా & ఎమర్జెన్సీ, యూరాలజీ వంటి 40కి పైగా వివిధ వైద్య విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ ఎంసీహెచ్ లేదా దానికి సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సీనియర్ డెమాన్‌స్ట్రేటర్స్ (నాన్ మెడికల్ పోస్టులు) పోస్టుల కోసం సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ డిగ్రీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2025 అక్టోబర్ 21వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,500 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1, 000గా ఉంది.
అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్‌లో గూగుల్ ఫామ్ లింక్ (నోటిఫికేషన్‌లో చూడొచ్చు) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 24, 25, 28 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే మొదట రాత పరీక్ష నిర్వహించి, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ రోజున దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీతో పాటు వయస్సు ధృవీకరణ, మార్క్ షీట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు (వర్తిస్తే) వంటి అన్ని పత్రాల ఒరిజినల్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీలను తప్పనిసరిగా సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుండి రూ.67,700 వరకు జీతం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్ aiimsmangalagiri.edu.inను సందర్శించండి.
