
ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయం: మంత్రి సత్యకుమార్
ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026 డిసెంబరు 1 నాటికి ‘95-95-99’ లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో యువత, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్) ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన 60 రోజుల ప్రత్యేక సమాచార, విద్య, అవగాహన ప్రచార కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గతంతో పోలిస్తే కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు 77 శాతం, మరణాలు 87 శాతం తగ్గాయని తెలిపారు.
95-95-99 లక్ష్యం ఏమిటంటే..
అంచనా వేసిన హెచ్ఐవీ బాధితుల్లో 95 శాతం మందికి తమకు హెచ్ఐవీ ఉన్నట్లు తెలిసి ఉండాలి. వారిలో 95 శాతం మంది యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) మందులు తీసుకుంటూ ఉండాలి. చికిత్స పొందుతున్న వారిలో 99 శాతం మందికి వైరల్ లోడ్ నియంత్రణలో ఉండాలి అనేదే 95-95-99 లక్ష్యమని మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రం ఈ మూడు దశల్లో 88-87-96.2 శాతం మేర పురోగతి సాధించిందన్నారు. మిగిలిన లక్ష్యాన్ని డిసెంబరు 1 నాటికి చేరుకునేందుకు అధికారులు, వైద్య సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
జిల్లాల వారీగా ప్రత్యేక దృష్టి
ఈ మూడు దశల్లో ఎక్కడ లోటు ఉందో గుర్తించి అక్కడే ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువతను ప్రధాన భాగస్వాములుగా చేసుకుని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
‘సురక్ష’ డ్యాష్‌బోర్డ్ ఆవిష్కరణ
హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాల పురోగతిని, జిల్లాల వారీగా ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రూపొందించిన ‘సురక్ష డ్యాష్‌బోర్డ్’ను మంత్రి ఆవిష్కరించారు. దీని ద్వారా ఏ జిల్లాలో పురోగతి ఎలా ఉంది? ఎక్కడ లోటు ఉంది? ఏ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి అవసరం? ఎక్కడ చర్యలను వేగవంతం చేయాలి? వంటి అంశాలను గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంటుంది.
60 రోజుల పాటు విస్తృత ప్రచారం
రాబోయే 60 రోజుల పాటు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ‘సురక్షిత్, సురక్షిత్ ప్లస్’ లక్ష్యాల సాధనకు కార్యాచరణ చేపడతామన్నారు. జానపద కళాజాతాలు, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. గర్భిణీలకు ముందస్తుగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించడం ద్వారా తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సంక్రమించకుండా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు తెలిపారు. అవసరమైన వారికి సకాలంలో చికిత్స అందేలా సేవలను మరింత బలోపేతం చేస్తామన్నారు.
ఏఆర్టీ కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏఆర్టీ కేంద్రాల పనితీరును సమీక్షించడంతో పాటు చికిత్స పొందుతున్న వారి కొనసాగింపును పర్యవేక్షిస్తున్నామని ఏపీ శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్‌రాజ్ తెలిపారు. హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందేలా, చికిత్సలో ఉన్నవారికి నిరంతర సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే 60 రోజుల్లో చేపట్టే అవగాహన కార్యక్రమాలను గ్రామాలు, విద్యాసంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, వల్నరబుల్ వర్గాల వరకు విస్తరిస్తామని తెలిపారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది, విద్యాసంస్థలు, ప్రసార మాధ్యమాల భాగస్వామ్యంతో ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ శాక్స్ ఇన్చార్జి అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, జేడీ ఐఈసీ డాక్టర్ మంజుల, జేడీ టీఐ సుకుమార్, జేడీ బీఎస్‌డీ, సీఎస్టీ డాక్టర్ శ్రీనివాసవర్మ, జేడీ బీటీఎస్ డాక్టర్ చక్రవర్తి తదితరులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.
