
ఎమ్మెల్సీగా నితీశ్‌కుమార్ రాజీనామా
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు తెరలేచింది. ఆయన త్వరలో ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశముందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మార్చి 1న 75వ పుట్టినరోజు జరుపుకున్న నితీశ్ కుమార్, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా అధికారం చేపట్టిన నాలుగు నెలలకే ఆయన సీఎంగా తన పదవికి వీడ్కోలు పలకాలని సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. నితీశ్ సన్నిహితులు గత కొంతకాలంగా రాజ్యాంగంలోని ఒక నిబంధనను ప్రస్తావిస్తున్నారు. దాని ప్రకారం శాసనసభ సభ్యత్వం లేకపోయినా వ్యక్తి ఆరు నెలల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు.
ఈ వ్యాఖ్యలతో జేడీయూ తన మిత్రపక్షమైన బీజేపీతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో గట్టి చర్చలు జరపవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జేడీయూ పార్టీకి అసెంబ్లీలో బీజేపీ కంటే కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువగా ఉన్నారు. అయితే ఎన్డీయే వర్గాల సమాచారం ప్రకారం, నితీశ్ రాజ్యసభ సభ్యుడిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కువకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశం తక్కువగా ఉందని అంటున్నారు. హిందూ సంప్రాదాయం ప్రకారం అశుభకాలంగా భావించే ఖర్మాస్ (మార్చి 15–ఏప్రిల్ 14) ముగిసిన తర్వాతే బీహార్‌లో అధికార మార్పు జరిగే అవకాశముందని కూడా వారు చెబుతున్నారు.
కొత్త సీఎంపై చర్చలు
బీహార్‌లో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి రావచ్చన్న అవకాశంపై పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్డీయే కూటమిలో భాగమైనప్పటికీ బీజేపీకి స్వంత ముఖ్యమంత్రి పదవి ఇప్పటివరకు దక్కలేదు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి కోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పేరు ముందంజలో ఉంది. ఆయన ప్రస్తుతం హోం శాఖను కూడా నిర్వహిస్తున్నారు. చౌదరి కోయరి వర్గానికి చెందిన నేత. బీహార్‌లో గణనీయమైన ఓబీసీ వర్గంగా ఉన్న కోయరి సమాజానికి ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీతో పూర్తిగా అనుబంధం లేదు. యాదవులు సాధారణంగా లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి మద్దతు ఇస్తే, కుర్మీలు నితీశ్ కుమార్‌కు మద్దతుగా ఉంటారు. అందువల్ల కోయరి వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేస్తే ఆ ఓబీసీ వర్గం మద్దతు దీర్ఘకాలం బీజేపీకి దక్కవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే చౌదరి గతంలో చాలా కాలం ఆర్జేడీ, జేడీయూ పార్టీల్లో పనిచేసి 2017లో బీజేపీలో చేరడం కారణంగా సంఘ్ పరివార్ వర్గాల్లో ఆయనకు పూర్తి మద్దతు లేకపోవచ్చని కొందరు సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
ఇంకొక ప్రధాన పేరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమీప వ్యక్తిగా భావిస్తారు. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక చివరకు ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
జేడీయూ డిమాండ్లు
ఇదిలా ఉండగా జేడీయూ వర్గాలు కొత్త మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కావాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించే అవకాశముందని సమాచారం.
నితీశ్ రాజీనామాపై భావోద్వేగ స్పందనలు
శాసన మండలి సభ్యత్వానికి నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో జేడీయూ, ఎన్డీయే వర్గాల్లో భావోద్వేగ స్పందనలు వ్యక్తమయ్యాయి. శాసన మండలి చైర్మన్ అవధేశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ నితీశ్ రాజీనామాతో బీహార్ ప్రజలు బాధపడుతున్నారు. ఆయన అందరినీ కలుపుకుని ముందుకు నడిపిన ప్రగతిశీల ముఖ్యమంత్రి,” అన్నారు. అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ కూడా నితీశ్ సేవలను ప్రశంసించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగీ మాట్లాడుతూ నితీశ్ బీహార్‌ను ‘జంగిల్ రాజ్’ నుంచి బయటకు తీసుకుని అభివృద్ధి దిశగా నడిపించారని అన్నారు. ఇక జేడీయూ నేతలు కూడా ఆయన నిర్ణయంపై భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాత్రం నితీశ్ రాజీనామా స్వచ్ఛందం కాదని, బీజేపీ ఒత్తిడితో ఆయనను తప్పించారని ఆరోపించారు.
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా సోమవారం బీహార్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్చి 16న రాజ్యసభకు ఎన్నికైన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగీ సమర్పించారు. గత 20 ఏళ్లుగా బంకిపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కృషి చేశానని నబీన్ తెలిపారు. పార్టీ అప్పగించిన కొత్త బాధ్యతలో కూడా బీహార్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
