
ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేసిన స్పీకర్
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేశారు.
సంజయ్‌పై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు వేశారు. ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ స్పీకర్ తీర్పునిచ్చారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్ల విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన అనంతరం, సంజయ్ కుమార్‌తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ 2024లో అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. అయితే, ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించగా, తాజాగా సంజయ్ కుమార్‌పై పిటిషన్ కూడా కొట్టివేయబడింది. సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్ తిరస్కరణతో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లపై దాఖలైన రెండు పిటిషన్లు మాత్రమే స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
సంజయ్ కుమార్ వివరణ
అనర్హత పిటిషన్ కొట్టివేయడంపై స్పందించిన సంజయ్ కుమార్, 2024లో తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వచ్చిన వార్తలు తప్పని అన్నారు. ఆ సమయంలో తాను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిశానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. తన జీతం నుంచి ప్రతినెల రూ.5,000లను బీఆర్ఎస్ శాసనసభా విభాగానికి విరాళంగా కట్ చేస్తున్నారని వెల్లడించారు. అలాగే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న విషయాన్ని కూడా సంజయ్ కుమార్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
