
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు (క్రైమ్ నంబర్ 30/2026) కు సంబంధించి, భారతీయ న్యాయ వ్యవస్థలోని ( బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 35(3) కింద ఈ నోటీసులు అందజేశారు.
సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఈ నోటీసులకు ప్రధాన కారణం. ఆ సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని, తద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, ఉన్నతాధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి అంశాలను పోలీసులు కేసులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏప్రిల్ 4న విచారణ
ఈ కేసు విచారణలో భాగంగా, ఏప్రిల్ 4న ఉదయం 11:30 గంటలకు సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని అధికారులు ఎమ్మెల్యేను ఆదేశించారు. విచారణకు వచ్చేటప్పుడు తన గుర్తింపు కార్డు సంబంధిత పత్రాలను వెంట తీసుకురావాలని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాలని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలను తారుమారు చేయవద్దని సీఐడీ అధికారులు హెచ్చరించారు. ఒకవేళ విచారణకు హాజరుకాకపోయినా లేదా దర్యాప్తుకు ఆటంకం కలిగించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న కౌశిక్ రెడ్డికి ఈ తాజా నోటీసులు రాజకీయంగా, చట్టపరంగా కొత్త సవాలుగా మారాయి.
నోటీసులపై ఎమ్మెల్యే స్పందన
సీఐడీ నోటీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. తనను, తన కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. రాజకీయాలు నాపై చేయండి, కానీ నా కుటుంబ సభ్యులను వేధించడం ఎంతవరకు న్యాయం? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాననే కారణంతోనే తనపై కేసులు పెట్టి, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతును అణచలేరని, తన పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
