
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లోని ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరుకావడాన్ని కోర్టు ప్రశ్నించగా, తాను సీనియర్ న్యాయవాదిగా హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 16కి హైకోర్టు వాయిదా వేసింది.
ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, తదనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపైనే ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద హైకోర్టులో విచారణ జరుగుతోంది.
