Let's talk: editor@tmv.in
ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలు ఆలస్యం.. మంత్రులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలు ఆలస్యం.. మంత్రులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

Pinjari Chand
18 మార్చి, 2026

కర్ణాటక అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానికి అపఖ్యాతి తెస్తోందని, సభ గౌరవాన్ని దెబ్బతీస్తోందని హెచ్చరించారు. మంత్రులందరికీ రాసిన లేఖలో, 16వ కర్ణాటక అసెంబ్లీ (2023–26) తొలి నుంచి తొమ్మిదో సమావేశం వరకు అడిగిన ప్రశ్నల్లో చాలా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మార్చి 16 నాటికి మొత్తం 245 ప్రశ్నల్లో కేవలం 90కే సమాధానాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ పరిస్థితి వల్ల ఎమ్మెల్యేలు సభలో సమర్థంగా పాల్గొనలేకపోతున్నారని, ఇది వారి హక్కులను కూడా హరిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఒక అరుదైన ఘటనగా స్పీకర్ యూటీ.ఖాదర్‌‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభను వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వ విభాగాలు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేత ఆర్.అశోక సహా ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. సభ పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ స్పందించలేదని ఆరోపించారు. సోమవారం జరిగిన సమావేశంలో హోం శాఖ మంత్రి జీ.పరమేశ్వర 200కు పైగా అన్‌స్టార్డ్ ప్రశ్నల్లో కేవలం 84 సమాధానాలనే సమర్పించడం వివాదానికి దారితీసింది. స్పీకర్ ఆందోళనలను ప్రస్తావిస్తూ సీఎం సిద్ధరామయ్య, సంబంధిత శాఖల కార్యదర్శులు తక్షణమే వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు గడువు పేర్కొంటూ ఆయా ఎమ్మెల్యేలుకు విడిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అధికారులపై నోటీసులు జారీ చేసి సస్పెన్షన్ కూడా విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే సభలో హామీ ఇచ్చింది.