
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు తేల్చండి: తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి పాలక పక్షమైన కాంగ్రెస్‌లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల పై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను సమయానికి విచారించడంలో విఫలమైనందుకు అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ నేత గద్దం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు సోమవారం కఠిన హెచ్చరిక జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీ.ఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం,స్పీకర్‌ను ఈ అనర్హత పిటిషన్లపై ఒక వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది. ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. నిర్ణయం తీసుకోవడం స్పీకర్ బాధ్యత. ఆయనకు రాజ్యాంగపరమైన రక్షణ లేదని ఇప్పుడే తీర్పుల ద్వారా స్పష్టం చేశాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ పరిణామం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన కాంటెంప్ట్ పిటిషన్ నేపథ్యంలో వచ్చింది. మూడు నెలల్లోపు డిస్క్వాలిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్పీకర్ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు, కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ స్పందించాల్సిందిగా కూడా రెండు వారాల గడువు ఇచ్చింది. స్పీకర్ తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది. స్పీకర్ ఈ విషయాన్ని తేల్చాలనుకుంటున్నారా లేక కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాలనుకుంటున్నారా అనేది ఆయనే నిర్ణయించుకోవాలని సీజేఐ గవాయి అన్నారు.
గత జూలైలోనే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లను వీలైనంత త్వరగా కనీసం మూడు నెలల్లో తీర్చాలని సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, విచారణను ఏ ఎమ్మెల్యే అయినా ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తే, ఆ సభ్యుడిపై ప్రతికూల అభిప్రాయం నమోదు చేయాలని కూడా స్పీకర్‌కు సూచించింది.స్పీకర్ ఇప్పుడైన నిర్ణయం తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కుంటారా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
