
ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట ఎందుకు వినడంలేదంటే ?
ఏపీలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, అక్రమాలు, వ్యవహరిస్తున్న తీరు.. ఇలా చాలా అంశాల్లో కూటమి ఎమ్మెల్యేల తీరు ముఖ్యమంత్రి చంద్రబాబులో అసహనానికి కారణమయిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి స్థితి లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు హెచ్చరించినా ఎమ్మెల్యేల తీరులో మార్పు లేదన్నది మరో వాదన. చంద్రబాబు చెప్పినా ఎందుకు వినడం లేదు ?. బాబు అంటే భయం పోయిందా ?. ఎందుకు పోయింది అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
ఏపీలో చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కూటమి ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో అపరిమిత అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సొంతంగా కూడా టీడీపీ బలంగా ఉంది. అయినప్పటికీ చంద్రబాబులో గతంలో ఉన్న అజమాయిషి ఎమ్మెల్యేలపై లేదని టాక్. దీనికి ఉదాహరణగా చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రస్తావిస్తున్నారు. తరుచూ ఎమ్మెల్యేలు మారడంలేదు. అవినీతి పెరిగింది. అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. చెప్పినా వినడం లేదు అన్న మాటలు చంద్రబాబు నోట తరుచూ వినిపిస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు తమ భూములు అమ్ముకోవాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే అంటూ వార్తలు ప్రచురితమవుతున్నాయి. ప్రసారమవుతున్నాయి.
ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల జోక్యం పెరుగుతోంది. ఇది అంతిమంగా ప్రజల్లో ఆగ్రహానికి, వ్యతిరేకతకు కారణమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలను పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చంద్రబాబు ముందు తలూపి, ఆ తర్వాత యధావిధిగా తమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. చంద్రబాబు చెప్పినా ఎమ్మెల్యేలు ఎందుకు వినడం లేదు. అపరిమిత అధికారం ఉన్న చంద్రబాబు చర్యలు తీసుకోలేరా ?. వారిని గాడిన పెట్టలేరా అన్న ప్రశ్న సాధారణంగానే వినిపిస్తుంది. ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వినకపోవడంతో తాజాగా ఆ బాధ్యతను ఆయా జిల్లా ఇంచార్జి మంత్రులకు అప్పగించారు. వారిని గాడిన పెట్టాల్సిన బాధ్యత ఇంచార్జి మంత్రులదే అంటూ చంద్రబాబు చెప్పారు. ఇంచార్జీ మంత్రులు మాత్రం.. చంద్రబాబు మాట వినకపోతే తమ మాట వింటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు పెరగడానికి.. చంద్రబాబు మాట వినకపోవడానికి కారణం.. ఆ పార్టీ విధానమే అన్నది ఒక అంచనా. ఎందుకంటే డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయించారు. జగన్ మనకంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. మనం అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలంటూ డబ్బున్న వ్యాపారులకు టికెట్లు ఇచ్చారు. గెలిచారు. ఇప్పుడు తిరిగి తమ డబ్బు రాబట్టుకోవాలి కదా.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నామన్నది ఎమ్మెల్యేల వాదన. ఒకవేళ తాము డబ్బు ఇప్పుడు సంపాదించకపోతే వచ్చే ఎన్నికల్లో తమకు మళ్లీ టికెట్ ఇస్తారా అంటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ఎన్నికలకు ముందు డబ్బున్న వాళ్లే గెలుపు గుర్రాలంటూ టికెట్లు ఇచ్చి, ఇప్పుడు ఖర్చు చేసిన డబ్బు సంపాదించద్దు అంటే ఎలా అంటూ ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ప్రతిపక్షంలో కష్టపడిన వారికంటే డబ్బున్న వారికే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చారు. దాని ఫలితమే నేటి ఎమ్మెల్యేల తీరు. అందుకే బాబుకు భయపడటం లేదు. బాబు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు. అన్ని విషయాలు ముఖ్యమంత్రికి తెలుసు. అయినప్పటికీ పత్రికల్లో ఎమ్మెల్యేల తీరు గురించి అసహనం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేలు తమ కార్యం పూర్తీ చేసుకుంటూ ఉంటారు.
