Let's talk: editor@tmv.in
ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనం.. నెలకు రూ.లక్ష అలవెన్స్‌: సీఎం విజయ్‌

ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనం.. నెలకు రూ.లక్ష అలవెన్స్‌: సీఎం విజయ్‌

Pinjari Chand
20 ఆగస్టు, 2026

పారదర్శక, అవినీతి రహిత పాలన కోసం తమిళనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనంతో పాటు నెలకు రూ.లక్ష అలవెన్స్‌ అందించనున్నట్లు ముఖ్యమంత్రి సి.జోసెఫ్‌ విజయ్‌ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఎమ్మెల్యేల వాహన నిర్వహణ, ఇంధన ఖర్చులు, డ్రైవర్‌ నియామకం కోసం నెలకు రూ.75 వేల, అసిస్టెంట్‌ నియామకం కోసం మరో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష అందిస్తామని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు తమ అధికారిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఎలాంటి రాజీ లేకుండా స్వతంత్రంగా, నిజాయితీగా పనిచేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని విజయ్‌ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజా ప్రతినిధుల ప్రయోజనాలకు సంబంధించిన ఈ నిర్ణయం అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలన అందించాలన్న టీవీకే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని సీఎం చెప్పారు. ఇందుకు అవసరమైన చట్టపరమైన సవరణలు చేపడతామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కట్టుమన్నార్కోయిల్‌ ఎమ్మెల్యే ఎల్‌.ఈ. జ్యోతిమణి కూడా ఈ అంశంపై విజ్ఞప్తి చేశారని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనం, అలవెన్స్‌ ప్రకటించిన సందర్భంగా అధికార టీవీకే ఎమ్మెల్యే కె.సింధు ఆనందంతో పాట పాడి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య బీమా రూ.25 లక్షలకు పెంపు

ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల వైద్య బీమా పరిమితిని ఏటా రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు విజయ్‌ ప్రకటించారు. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు వైద్య, శస్త్రచికిత్స సేవలను అదనంగా ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో అందించనున్నట్లు తెలిపారు. చెన్నై స్టాన్లీ, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్‌, ధర్మపురి, కన్యాకుమారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర చెన్నై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పెరంబూరులో 400 పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి క్యాన్సర్‌ కేర్‌ మిషన్‌ను రూ.677.44 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు తెలిపారు. చెన్నైలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రూ.471.80 కోట్లతో కొత్త ఇంటిగ్రేటెడ్‌ క్యాన్సర్‌ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తంజావూరు, కోయంబత్తూరు, మదురై సహా ఐదు జిల్లాల్లో ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రోబోటిక్‌ సర్జరీ వ్యవస్థలు, లీనియర్‌ యాక్సిలేటర్లు వంటి ఆధునిక వైద్య పరికరాలతో పాటు కొన్ని జిల్లాల్లో మహిళలకు హెచ్‌పీవీ, డీఎన్‌ఏ పరీక్షలు, పోషకాహార సహాయం అందించనున్నట్లు సీఎం చెప్పారు. వైద్యం హక్కే తప్ప సౌకర్యం కాదని, ఆదాయం లేదా ప్రాంతంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని విజయ్‌ తెలిపారు.

ఆవిన్‌ పాల సేకరణ ధర పెంపు

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆవిన్‌’ పాల సేకరణ ధరను లీటరుకు రూ.38 నుంచి రూ.41కు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీనివల్ల ఏటా అదనంగా రూ.360 కోట్ల వ్యయం అవుతుందని, సుమారు 3.16 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

మూడో బిడ్డకు 365 రోజులు ప్రసూతి సెలవులు

మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డ జననానికి ప్రస్తుతం ఉన్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. మొదటి ఇద్దరు పిల్లల జననానికి ప్రస్తుతం 365 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుండగా.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు బతికి ఉన్న మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు 12 వారాల సెలవు మాత్రమే ఉంది. ఇకపై మూడో బిడ్డకు కూడా 365 రోజుల సెలవు అందించనున్నారు. పద్దులపై చర్చ సందర్భంగా మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి.శరత్‌కుమార్‌ ఈ ప్రకటన చేశారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.