
ఎమ్మిగనూరు కూటమిలో ముసలం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాజకీయంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే చేరిపోయారు. కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయం నడుస్తోంది. కూటమి పార్టీల నేతలు ప్రతిపక్ష వైసీపీలో చేరుతున్నారు. రాష్ట్రమంతా ఒకతీరు ఉంటే.. ఎమ్మిగనూరులో మరొక తీరుగా రాజకీయం నడుస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బివి. జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి పార్టీలు ఆయన గెలుపునకు సహకరించాయి. కానీ అధికారంలోకి వచ్చాక వారిని పక్కనపెట్టారు. బీజేపీ,జనసేన నేతల మాట ఎక్కడా చెల్లుబాటు కావడంలేదన్న ఆవేదన వారిలో ఉంది. దీంతో కూటమిలో కొనసాగలేక, బీజేపీ ఎమ్మిగనూరు ఇంచార్జీ కేఆర్. మురహరి రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. దాదాపు పదేళ్లుగా బీజేపీలో కొనసాగతున్న మురహరి రెడ్డి రాజీనామాకు.. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తీరే కారణం అన్నది ఆయన వర్గీయుల మాట.
ఎమ్మెల్యే కూటమి ధర్మాన్ని పాటించలేదన్న వాదన మురహరి రెడ్డి వర్గీయులు వినిపిస్తున్నారు. బీజేపీ పెద్దలు కూడా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించకపోవడం మరొక కారణంగా కనిపిస్తోంది. మురహరిరెడ్డి రాకతో వైసీపీకి కొంత బలం చేకూరింది. ఎందుకంటే మురహరిరెడ్డి తాత హన్మంతరెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పదేళ్లుగా మురహరిరెడ్డి బీజేపీలో ఉన్నారు. ఇవన్నీ వైసీపీకి కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకుల అంచనా. మరోవైపు ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన టీడీపీ మాజీ కౌన్సిలర్లు కూడా వైసీపీలోకి చేరారు. సొంతపార్టీ వారిలో కూడా ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంపుల్లయ్య యాదవ్, మరికొందరు మాజీ కౌన్సిలర్లతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇలా బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నేతలు క్యూ కడుతున్నారు. దీనంతటకి టీడీపీ ఎమ్మెల్యే తీరు కారణమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే తీరు వైసీపీకి మేలు చేకూరుస్తోందని అంచనా వేస్తున్నారు. వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే తీరు మారకపోతే టీడీపీకి మరింత నష్టం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
