
ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్ ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడలా? ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం
ఎమర్జెన్సీ వార్డులో కోవిడ్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ డాక్టర్ లేచి నిలబడలేదన్న కారణంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఎంతవరకు సబబు. ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడాలన్న నిబంధన ఏమైనా ఉందా? హర్యానా ప్రభుత్వానికి కనీస స్పృహ ఉందా? ఎందుకు ఇటువంటి కలిచి వేసే వైఖరిని తీసుకున్నారని పంజాబ్–హర్యానా హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు వైద్య వృత్తికి అవమానకరమని, వీటిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అంకితభావంతో పనిచేసే వైద్య నిపుణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే "అవాంఛనీయ సంఘటనలను" అరికట్టాలని జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, రోహిత్ కపూర్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వైద్యుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సును అభ్యసించడానికి అవసరమైన నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని హర్యానా అధికారులను ఆదేశించింది. రాష్ట్రంపై రూ. 50,000 జరిమానా విధించింది. ఒక ఎమ్మెల్యే ఆసుపత్రి అత్యవసర వార్డులోకి ప్రవేశించినప్పుడు వైద్యుడు లేచి నిలబడతాడని ఆశించడం, ఆయన లేవకపోతే క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ప్రతిపాదించడం చాలా బాధాకరం.
డాక్టర్ మనోజ్ కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ డ్యూటీలో పనిచేస్తున్న రోజులలో జరిగిన ఘటన. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే, తాను లోపలికి వచ్చేసరికి డాక్టర్ లేచి నిలబడలేదని అసహనం వ్యక్తం చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రం హర్యానా సివిల్ సర్వీసెస్ (పనిష్‌మెంట్,అప్పీల్) రూల్స్–2016 కింద షోకాజ్ నోటీసు ఇచ్చింది.2024 జూన్‌లో డాక్టర్ మనోజ్ ప్రభుత్వానికి సమాధానమిస్తూ ఎమ్మెల్యేను గుర్తు పట్టలేకపోయాను. ఉద్దేశపూర్వకంగా అవమానించడం కాదని స్పష్టం చేసినా… ఇప్పటివరకు రాష్ట్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండా విచారణను పెండింగ్‌లో ఉంచింది.
ఆగ్రహం వ్యక్తం చేసిన బెంచ్
కోవిడ్–19 సమయంలో ఎమర్జెన్సీలో పనిచేస్తున్న డాక్టర్… పేషెంట్లతో నిమగ్నమై ఉన్న సమయంలో ఎమ్మెల్యే రాగానే లేచి నిలబడాలని ఆశించడం అత్యంత దారుణం. అలాంటి కారణంతో క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడం లాజిక్ లేని పని అని వ్యాఖ్యానించింది. అలాగే ఇలాంటి షోకాజ్ పెండింగ్‌లో ఉందని డాక్టర్‌కి ఎన్వోసీ నిరాకరించడం మరింత అన్యాయం, వివక్షత అని పేర్కొంది. వైద్య విద్య, వైద్య సేవలు ఎంత కఠినమో, డాక్టర్లు ఎంత అంకితభావంతో పనిచేస్తారో గుర్తుచేసింది. రోగుల బంధువులు లేదా ప్రజా ప్రతినిధులు
సహా అందరూ డాక్టర్లను గౌరవించాలి. అనవసరంగా అవమానించే ఘటనలు తరచూ వస్తున్నాయి… వీటికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది.
దీనితో పిటిషన్‌ను అనుకూలంగా తీర్పు ఇస్తూ
డాక్టర్ మనోజ్‌కు రాష్ట్రం వెంటనే ఎన్వోసీ జారీ చేయాలి అని ఆదేశించింది. అదే సమయంలో, రాష్ట్రంపై రూ.50,000 జరిమానా విధిస్తూ ఆ మొత్తాన్ని పీజీఐఎంఈఆర్ , చండీగఢ్‌లోని పూర్ పేషెంట్ వెల్ఫేర్ ఫండ్లో జమ చేయాలని పేర్కొంది.
