Let's talk: editor@tmv.in
ఎఫ్ స్టీన్ ఫైల్స్ పై ప్రధాని స్పష్టత ఇవ్వాలి: కాంగ్రెస్ డిమాండ్

ఎఫ్ స్టీన్ ఫైల్స్ పై ప్రధాని స్పష్టత ఇవ్వాలి: కాంగ్రెస్ డిమాండ్

Pinjari Chand
2 ఫిబ్రవరి, 2026

ఎఫ్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి తాజాగా మూఫ్పై లక్షల పేజీలు విడుదల కావడం, అందులో భారత ప్రధాని పేరు, ఇతర మంత్రుల పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్న సమయంలో దీనిపై సమగ్రంగా స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్నాయని చెబుతున్న ‘ఇంతవరకు బయటకు రాని విషయాలు ఇప్పుడు బయటపడటం’పై ఆయన స్వయంగా స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కె.సి. వేణుగోపాల్ ఎక్స్ లో చేసిన పోస్టులో ఎఫ్ స్టీన్ ఫైల్స్‌లోని తాజా నివేదికలు ప్రధాని మోడీకి ఎలాంటి వ్యక్తులకు ప్రాప్యత ఉందనే విషయంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి విదేశీ ప్రభావాలకు ఆయన లోనయ్యే అవకాశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కలవరపెట్టే బహిర్గతాలపై ప్రధాని వ్యక్తిగతంగా సమాధానం చెప్పాలి. ఆయన ఎప్పుడైనా జెఫ్రీ ఎప్స్టీన్‌ను కలిశారా? లేదా ఆయన తరఫున ఎవ్వరైనా కలిశారా? ఆ చర్చలు ఏ విషయాలపై జరిగాయి? అని వేణుగోపాల్ ప్రశ్నించారు. అలాగే అందులో ఇజ్రాయేల్ పర్యటన సమయంలో అక్కడ జరిగిన విషయాలను కూడా తెలియజేయాలని కోరారు.

జెఫ్రీ ఎప్స్టీన్‌పై నమోదైన లైంగిక అక్రమ రవాణా కేసులకు సంబంధించిన వేలాది పేజీల పత్రాలు, ప్రయాణ వివరాలు, ఈ మెయిల్స్, రికార్డింగ్స్ ఇటీవల మరోసారి చర్చకు వచ్చాయి. 2019లో జైలు కస్టడీలో ఎప్స్టీన్ మరణించిన సంగతి తెలిసిందే.

ఇదే అంశంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ మాట్లాడుతూ ఈ విషయంపై ప్రధాని మోడీ స్వయంగా వివరణ ఇవ్వాలన్నారు. అలాగే కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా 2019 ఎన్నికల సమయంలో ఎప్స్టీన్‌తో ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అయితే శనివారం బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఎప్స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు పత్రాల్లోని ఒక సాధారణ ఇమెయిల్ ముక్కను వక్రీకరించి ప్రధాని మోడీపై రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. మోడీకి ఎప్స్టీన్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్నట్లు ఏ ఆధారమూ లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందిస్తూ, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని పై వచ్చిన ప్రస్తావనను దోషిగా తేలిన నేరస్తుడి నిరాధార వ్యాఖ్యలుగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించింది.