Let's talk: editor@tmv.in
ఎఫ్‌స్టీన్ తో సంబంధాలపై హర్దీప్ స్పష్టత ఇవ్వాలి: కాంగ్రెస్

ఎఫ్‌స్టీన్ తో సంబంధాలపై హర్దీప్ స్పష్టత ఇవ్వాలి: కాంగ్రెస్

Pinjari Chand
18 ఫిబ్రవరి, 2026

‘ఎఫ్‌స్టీన్ ఫైల్స్’ అంశంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. 2014 నుంచి 2017 మధ్య అమెరికాలో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్​రీ ఎప్ స్టీన్ తో 62 ఈ–మెయిల్ ద్వార సంభాషణ, 14 సమావేశాలు జరిపిన విషయంపై పూరీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పునరుద్ఘాటించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను పూరీ పూర్తిగా ఖండించారు. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగాధిపతి పవన్ ఖేరా ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014 నుంచి 2017 వరకు హర్‌దీప్ పూరీ, ఎఫ్‌స్టీన్ మధ్య 62 ఈ–మెయిల్ మార్పిడులు జరిగాయి. 2014లో జూన్ 5, 6, 8, 9, సెప్టెంబర్ 19, 23, 24, అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఏమి చర్చించారో చెప్పాలని ప్రశ్నించారు. పూరీ 32 ఈ మెయిళ్లు పంపగా, ఎఫ్‌స్టీన్ 30 పంపాడు. 2014లో ప్రధాని నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2017 వరకు కొనసాగాయి. జూన్ 2014లో హర్‌దీప్ పూరీ ఏ పదవిలో ఉన్నారు? ఏ హోదాలో ఎఫ్‌స్టీన్ ను కలిశారు?అని ఖేరా అడిగారు.

‘ఎఫ్‌స్టీన్ ఫైల్స్’ అనేవి ఎఫ్‌స్టీన్ ,అతని సహచరురాలు గిస్లెయిన్ మ్యాక్స్ వెల్ పై నమోదైన లైంగిక అక్రమ రవాణా కేసులకు సంబంధించిన వేలాది పేజీల పత్రాలు. ప్రయాణ రికార్డులు, రికార్డింగులు, ఈ మెయిల్స్ తదితరాలు అందులో ఉన్నాయి. 2019లో ఎఫ్‌స్టీన్ జైలులో మరణించిన తర్వాత ఇవి విస్తృత చర్చకు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో పూరీ అనేక అబద్ధాలు చెప్పారని ఖేరా ఆరోపించారు. ఒక సాధారణ పౌరుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను ఎఫ్‌స్టీన్ తో ఎందుకు పంచుకున్నారు? ముందుగా రాజీనామా చేసి, తర్వాత వివరణ ఇవ్వాలని అన్నారు. అదనంగా, ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ హాజరవుతారా లేదా అన్న అంశంపై కూడా కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ వర్గాలు బిల్ గేట్స్ రారు అంటున్నాయి. కానీ ఆయనే వస్తానని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఎఫ్‌స్టీన్ బాధితుల్లో ఎవరూ గేట్స్‌పై తప్పుదారి పట్టించే ఆరోపణలు చేయలేదు. అయితే అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో ఎఫ్‌స్టీన్ చేసిన ఒక ఆరోపణ ప్రస్తావనకు వచ్చింది. గేట్స్ ప్రతినిధి ఆ ఆరోపణలను పూర్తిగా అర్ధరహితంగా కొట్టిపారేశారు.ఇక హర్‌దీప్ పూరీ కాంగ్రెస్, గాంధీ కుటుంబం తనపై పరోక్ష ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను ఎఫ్‌స్టీన్ ను కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిశానని, కానీ ఆ సంబంధాలకు ఎఫ్‌స్టీన్ చేసిన నేరాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.