
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు ‘దుర్మార్గమైంది: స్టాలిన్
కేంద్రం ప్రతిపాదించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు–2026 ‘దుర్మార్గమైంది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ విమర్శించారు. ముఖ్యంగా క్రైస్తవ సేవా సంస్థలు సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపిస్తూ దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్‌కోయిల్‌లో జరిగిన సభలో స్టాలిన్ మాట్లాడారు. మత్స్యకారులకు ఇచ్చే ఫిషింగ్ బాన్ పీరియడ్ ప్రత్యేక సహాయాన్ని రూ.5,000 నుంచి రూ.8,000కు పెంచామని గుర్తు చేస్తూ, ఇకపై నెలకు రూ.12,000గా పెంచనున్నట్లు ప్రకటించారు. అలాగే చేపల వేట తగ్గిన కాలంలో ఇచ్చే సహాయాన్ని రూ.6,000 నుంచి రూ.9,000కు పెంచుతామని తెలిపారు. మత్స్యకార సంక్షేమ బోర్డులో సభ్యత్వం పొందేందుకు గరిష్ట వయోపరిమితిని 65 నుంచి 70 సంవత్సరాలకు పెంచుతామని, 70–75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సభ్యులకు నెలవారీ పెన్షన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాను నేతృత్వం వహిస్తున్న ద్రావిడ మోడల్ ప్రభుత్వం మత్స్యకారులకు నిజమైన మిత్రుడిలా పనిచేస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మత్స్యకారులను రక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారత్‌కు చిన్న పొరుగు దేశాలపై కూడా ప్రభావం లేకుండా పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. శ్రీలంక నౌకాదళం తమిళనాడు మత్స్యకారులపై వరుసగా దాడులు చేస్తున్నప్పటికీ కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
మధురై ప్రాజెక్ట్ దశాబ్దకాలంగా కొనసాగుతోంది
యూపీఏ ప్రభుత్వ కాలంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ‘బలహీనుడు’ అని మోడీ విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. మరి ఇప్పుడు మోడీ తాను బలహీన ప్రధానమంత్రి అని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. మధురైలో ప్రతిపాదించిన ఎయిమ్స్ మధురై ప్రాజెక్టు దాదాపు దశాబ్దంగా కొనసాగుతూనే ఉందని, దీనిపై స్పష్టమైన సమాధానాలు లేవని ఆయన విమర్శించారు.
స్టాలిన్ మాట్లాడుతూ ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు మైనారిటీలను, ముఖ్యంగా క్రైస్తవ సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. చిన్న తప్పిదాలకే విదేశీ నిధులను స్వీకరించే సంస్థల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఈ బిల్లులో ఉందని అన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు వంటి సంస్థలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు. క్రైస్తవ సంస్థలు విద్య, వైద్య రంగాల్లో చేస్తున్న సేవలను ప్రధాని మోడీ గతంలో ప్రశంసించారని, అయితే ఇప్పుడు వాటిపైనే చర్యలు తీసుకోవడం ఆయన అసలు స్వరూపాన్ని చూపిస్తోందని విమర్శించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరించినట్లవుతుందని, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, గ్రామీణ పేదలపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఇది మత స్వేచ్ఛపై తీవ్రమైన దాడి మాత్రమే కాకుండా సామాజిక సేవలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఈ బిల్లును మొదట నేనే వ్యతిరేకించా
తమిళనాడు నుంచి ఈ బిల్లును మొదటగా వ్యతిరేకించిన వ్యక్తిని తానేనని, దీనిని ఉపసంహరించుకోవాలని ప్రధానికి లేఖ కూడా రాసినట్లు స్టాలిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది క్రైస్తవ విద్యా, వైద్య సంస్థలు పనిచేస్తున్నాయని, అవి లేకపోతే ప్రభుత్వం వెంటనే ఆ సేవలను భర్తీ చేయలేదని చెప్పారు. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల కారణంగా బీజేపీ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందని, అయితే త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదింపజేయాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇదే సందర్భంలో బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అని స్టాలిన్ ప్రశ్నించారు. ముస్లింల విషయంలో సీఏఏ, వక్ఫ్ సవరణలపై చేసినట్లే క్రైస్తవులను కూడా మోసం చేయబోతున్నారా అని ప్రశ్నించారు. అన్నాడీఎంకే అధినేత కే.పళనిస్వామి శుక్రవారం అంబూరులో మాట్లాడుతూ మైనారిటీలను కాపాడుతామని చెప్పారని గుర్తు చేశారు. అయితే తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే ఆయన బీజేపీకి లోంగిపోయారని స్టాలిన్ విమర్శించారు. ఇక, లోక్‌సభలో మార్చి 25న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యనందరాయ్ ప్రవేశపెట్టిన ఈ ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత పెంచడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వాటి దుర్వినియోగాన్ని నివారించడం లక్ష్యంగా తీసుకువచ్చినదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
