Let's talk: editor@tmv.in
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై రాజకీయ రగడ

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై రాజకీయ రగడ

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు–2026పై బుధవారం పార్లమెంట్‌లో తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సవరణలు జాతీయ భద్రత, పారదర్శకత కోసం అవసరమని బీజేపీ వాదిస్తుండగా, ప్రభుత్వానికి అనుకూలంగా లేని స్వచ్ఛంద సంస్థలను నియంత్రించడమే లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మైనారిటీ హక్కులపై కూడా దీని ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. బిల్లును సమర్థిస్తూ బీజేపీ ఎంపీ దినేశ్‌ శర్మ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ చట్టం మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రభుత్వం మైనారిటీలు–మెజారిటీలు అని భేదం చూపదు. దేశ భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో చెప్పారు. విదేశీ నిధులు అందుకునే స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం, నక్సలిజం ప్రోత్సాహానికి ఉపయోగిస్తే వాటిపై పరిమితులు విధించడం అవసరమని ఆయన అన్నారు. మరో బీజేపీ ఎంపీ గులాం అలీ ఖటానా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మైనారిటీలను అంచులకు నెట్టింది కాంగ్రెసే. ఇప్పుడు వారిని భయపెట్టి ఓటు బ్యాంకుగా మార్చాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ బుజ్జగింపు రాజకీయాలను నమ్మరని, చట్ట పరిమితుల్లో పనిచేసే ఏ సంస్థకైనా అభివృద్ధి అవకాశాలు ఉంటాయని ఖటానా పేర్కొన్నారు.

అయితే ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఎన్‌జీఓలు, సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి అనే నినాదాలతో పెద్ద బ్యానర్‌ ప్రదర్శిస్తూ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగ విరుద్ధం

ఈ నిరసనలో కాంగ్రెస్‌ ఎంపీలు, సమాజ్‌వాదీ పార్టీ నేతలు డింపుల్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌, , ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఈటీ. ముహమ్మద్‌ బషీర్‌‌, ఎన్సీపీ (ఎస్‌పీ) నాయకురాలు సుప్రియా సులే , ఆర్‌ఎస్‌పీకి చెందిన ఎన్‌కే. ప్రేమచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ ఈ సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని సమానత్వ హక్కు (ఆర్టికల్‌ 14), వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించిన ఆర్టికల్‌ 19, ఆస్తి హక్కుకు సంబంధించిన ఆర్టికల్‌ 300ఏలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

మదర్‌‌ థెరిస్సా స్థాపించిన సంస్థకూ ఎఫ్‌సీఆర్‌‌ఏ రద్దు

మరో కాంగ్రెస్‌ ఎంపీ హిబి ఇడెన్‌ మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు కఠినంగా ఉన్నాయని అన్నారు. విద్యా సంస్థలు, అనాథాశ్రమాలు వంటి సేవా కార్యక్రమాలకు విదేశీ నిధులు అందుతున్నప్పుడు వాటిని లక్ష్యంగా చేసుకోవడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. 2021లో మదర్‌‌ థెరిస్సా స్థాపించిన ఒక సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ నమోదు రద్దు చేయడం దురదృష్టకరమని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు సాధారణ ప్రజలకు ఉపయోగపడడం లేదని, కొందరు పెద్ద వ్యాపార వర్గాలకు లేదా ప్రత్యేక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. ఎస్పీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ ఇష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

ఇదిలా ఉండగా విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని సవరించే ఈ బిల్లును మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విదేశీ నిధులను బలవంతపు మత మార్పిడుల వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగంలో పారదర్శకత పెంచడం, వాటి సరైన వినియోగాన్ని నిర్ధారించడమే లక్ష్యమని చెప్పారు. మరో కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు కూడా ఈ బిల్లును సమర్థించారు. విదేశీ నిధులను దేశ భద్రతకు వ్యతిరేకంగా ఉపయోగించకుండా అడ్డుకోవడమే ఉద్దేశమని, ఎలాంటి మత సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై ఎందుకింత ఆందోళన?

విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుతో స్వచ్ఛంద సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ పెరిగే అవకాశం ఉందని, మైనారిటీ,సేవా సంస్థలకు ఇబ్బందులు కలగవచ్చని వారు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షాల అభిప్రాయం ప్రకారం ఈ సవరణల వల్ల స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) ప్రభుత్వానికి నచ్చని కార్యకలాపాలు చేస్తే వాటిపై సులభంగా చర్యలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల పౌర సమాజ సంస్థల స్వేచ్ఛ తగ్గే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అదేవిధంగా విదేశీ నిధులపై మరిన్ని పరిమితులు విధిస్తే విద్యాసంస్థలు, అనాథాశ్రమాలు, మైనారిటీ సేవా సంస్థలు వంటి సంస్థలకు నిధులు తగ్గే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇంకా ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసనలు నిర్వహించే సంస్థలపై విదేశీ నిధుల పేరుతో చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ విమర్శలను అణిచివేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.

అలాగే ఇప్పటికే ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, 2014 తర్వాత చట్టం మరింత కట్టుదిట్టం అయిందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మరిన్ని పరిమితులు అవసరం లేదని వారు వాదిస్తున్నారు.