Let's talk: editor@tmv.in
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్

Shaik Mohammad Shaffee
27 నవంబర్, 2025

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌ను పదవి నుంచి తొలగించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు ఇటీవల ఎంఎస్ నౌ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ట్రంప్ ఈ వార్తలను కొట్టిపారేస్తూ, పటేల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. మంగళవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ను ఈ తొలగింపు వార్తలపై ప్రశ్నించగా, ఆయన స్పష్టంగా సమాధానమిచ్చారు. "అతడు గొప్పగా పని చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను" అని ట్రంప్ పటేల్‌ను ప్రశంసించారు. ఈ వార్తలు అబద్ధమని వైట్‌హౌస్ ఇంతకుముందే ఖండించినప్పటికీ, అధ్యక్షుడే స్వయంగా మాట్లాడటంతో పుకార్లకు మరింత స్పష్టమైన సమాధానం లభించింది.

"కల్పిత కథ" అన్న వైట్‌హౌస్

ఎంఎస్ నౌ పత్రిక పేర్కొన్నదేమిటంటే.. ట్రంప్, అతడి కీలక సిబ్బంది, పటేల్ వల్ల వస్తున్న ప్రతికూల వార్తలతో అసంతృప్తిగా ఉన్నారని, ఆయన స్థానంలో ఎఫ్‌బీఐ కో-డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ బైలీ పేరును పరిశీలిస్తున్నారని పేర్కొంది. అయితే వైట్‌హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, ఎంఎస్ నౌ కథనం "పూర్తిగా కల్పితం" అని తేల్చి చెప్పారు.

లీవిట్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వార్త ప్రచురించబడిన సమయంలో ట్రంప్, పటేల్‌తో కలిసి ఓవల్ కార్యాలయంలో ఒక సమావేశంలో ఉన్నారు. ఆ వార్తను చదివిన ట్రంప్ నవ్వుతూ, "ఏమిటి? ఇది పూర్తిగా అబద్ధం. రా కాష్, నువ్వు గొప్పగా పనిచేస్తున్నావని చూపించడానికి ఒక ఫొటో తీసుకుందాం!" అని అన్నారు. లీవిట్, ట్రంప్-పటేల్ కలిసి దిగిన ఆ ఫొటోను కూడా పోస్ట్ చేసి పుకార్లకు ముగింపు పలికారు. అయితే ఎంఎస్ నౌ పత్రిక మాత్రం తమ కథనానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.

ఎఫ్‌బీఐ డైరెక్టర్ నియామక నియమాలు

ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవీకాలం 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ నియామకంపై రాజకీయ ఒత్తిడి ఉండకుండా ఉండేందుకే ఈ నియమాన్ని పెట్టారు. సెనెట్ ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడు ఈ పదవిలో నియమిస్తారు.

పటేల్‌.. ట్రంప్‌కు నమ్మకమైన వ్యక్తి. మొదటి ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ గూఢచార సంస్థ, రక్షణ శాఖలలో సలహాదారుగా పనిచేశారు. ఆయన ఎఫ్‌బీఐ నుంచి ఇంటెలిజెన్స్ సేకరణ విధులను తొలగించాలని, ట్రంప్ అజెండాకు మద్దతు ఇవ్వని ఉద్యోగులను తొలగించాలని బహిరంగంగా మాట్లాడారు.

జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఎఫ్‌బీఐ భాగమైన న్యాయశాఖలో 200 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. వీరిలో పలువురు ట్రంప్, ఆయన మిత్రులతో సంబంధం ఉన్న క్రిమినల్ కేసులపై పనిచేసినవారు కావడం గమనార్హం.

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్ - Tholi Paluku