
ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్: పోరాడి ఓడిన భారత్.. షూటౌట్‌లో స్పెయిన్ విజయం
ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో నిర్ణీత సమయంలో 1-1తో డ్రా చేసుకున్న భారత్, అనంతరం జరిగిన షూటౌట్‌లో 3-4తో ఓటమిపాలైంది. ఈ ఓటమితో భారత్ కేవలం ఒక పాయింట్‌కే పరిమితమైంది.
ఆఖరి నిమిషం వరకు ఆధిక్యం
మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ పోరులో, భారత జట్టు 59వ నిమిషం వరకు 1-0తో ఆధిక్యంలో కొనసాగింది. 19వ నిమిషంలో కెప్టెన్ హార్దిక్ సింగ్ అందించిన పాస్‌ను మణిందర్ సింగ్ అద్భుతమైన 'టొమాహాక్' షాట్‌తో గోల్‌గా మలచి భారత్‌కు కీలకమైన ఆధిక్యాన్ని అందించారు. ఆ తర్వాత భారత్ తన రక్షణ వలయాన్ని పటిష్టం చేసుకున్నా, చివరి నిమిషంలో జరిగిన డిఫెన్సివ్ లోపం కారణంగా స్పెయిన్ క్రీడాకారుడు బ్రూనో ఫాంట్ గోల్ చేసి స్కోరును సమం చేశారు. తద్వారా మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
హోరాహోరీగా సాగిన పోరు
మ్యాచ్‌లో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. స్పెయిన్ నాలుగో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను పొందినా, భారత గోల్‌కీపర్ మోహిత్ అద్భుతంగా అడ్డుకున్నారు. అలాగే భారత గోల్‌కీపర్ సూరజ్ కర్కెరా కూడా పలుమార్లు స్పెయిన్ ఆటగాళ్లను కట్టడి చేసి, జట్టును కాపాడారు. మూడో క్వార్టర్ చివర్లో స్పెయిన్ ఆటగాడు గ్రీన్ కార్డ్ చూసి బయటకు వెళ్లినా, భారత్ ఆ అవకాశాన్ని గోల్‌గా మలచలేకపోయింది. చివరి క్వార్టర్‌లో భారత్ ఆటగాడు సంజయ్ కూడా గ్రీన్ కార్డ్ కారణంగా మైదానం వీడాల్సి వచ్చింది. భారత్ లీడ్‌ను కాపాడుకోవాలని శతవిధాల ప్రయత్నించినా, ఆఖరి నిమిషంలో బ్రూనో ఫాంట్ కొట్టిన గోల్ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది.
షూటౌట్‌లో వైఫల్యం
నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో స్కోరును సమం చేయడంతో, విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించారు. ఇందులో భారత స్టార్ ఆటగాళ్లు అభిషేక్, కెప్టెన్ హార్దిక్ సింగ్ గోల్స్ చేయడంలో విఫలం కావడంతో, భారత్ 3-4 తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన భారత్, కేవలం 2 పాయింట్లతో తొమ్మిది జట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉండగా, నేడు జరగనున్న కీలక పోరులో భారత్ ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది
