Let's talk: editor@tmv.in
ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ బరిలో భారత మహిళల హాకీ జట్టు

ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ బరిలో భారత మహిళల హాకీ జట్టు

Shaik Mohammad Shaffee
17 మార్చి, 2026

భారత మహిళల హాకీ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. జూన్ 15 నుండి 21 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా జరగనున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ నేషన్స్ కప్‌లో భారత్ తలపడనుంది. హాకీ ప్రో లీగ్‌లో భాగం కాని అగ్రశ్రేణి జట్లకు అంతర్జాతీయ స్థాయి పోటీని అందించేందుకు, విజేతగా నిలిచిన జట్టును తదుపరి సీజన్ ప్రో లీగ్‌కు ప్రమోట్ చేసేందుకు 2021లో ఈ టోర్నీని ప్రారంభించారు. 2024-25 ప్రో లీగ్ సీజన్‌లో పట్టికలో అట్టడుగున నిలవడంతో భారత మహిళా జట్టు ఈసారి నేషన్స్ కప్‌‌నకు పరిమితం కావాల్సి వచ్చింది.

బరిలో మేటి జట్లు

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌తో పాటు ఆతిథ్య న్యూజిలాండ్, అమెరికా, జపాన్, కొరియా, చిలీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. గత నేషన్స్ కప్‌లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు పురుషుల నేషన్స్ కప్ పోటీలు జూన్ 11 నుండి 20 వరకు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరగనున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, కొరియా, జపాన్, వేల్స్, మలేషియాతో పాటు ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు పాల్గొంటున్నాయి.

ఆతిథ్యంపై ఎఫ్‌ఐహెచ్ హర్షం

నేషన్స్ కప్ వేదికలను ఖరారు చేసిన సందర్భంగా అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు వేర్వేరు ఖండాల్లో అద్భుతమైన నగరాల్లో ఈ టోర్నీలు జరగడం విశేషమని ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ అభిమానులను అలరించేలా అత్యుత్తమ జట్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 2022లో పురుషుల తొలి నేషన్స్ కప్ దక్షిణాఫ్రికాలోనే జరగడం గమనార్హం. ఈసారి కూడా భారత మహిళల జట్టు చాంపియన్‌గా నిలిచి తిరిగి ప్రో లీగ్‌లోకి అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ బరిలో భారత మహిళల హాకీ జట్టు - Tholi Paluku