Let's talk: editor@tmv.in
ఎఫ్‌ఎంసీజీ రంగానికి బడ్జెట్ ఊతం: ఎస్‌బీఐ నివేదిక

ఎఫ్‌ఎంసీజీ రంగానికి బడ్జెట్ ఊతం: ఎస్‌బీఐ నివేదిక

Shaik Mohammad Shaffee
3 ఫిబ్రవరి, 2026

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలు దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగానికి కొత్త ఊపిరి పోయనున్నాయి. ఈ బడ్జెట్ చర్యలు ఎఫ్‌ఎంసీజీ రంగంపై 'మితమైన సానుకూల' ప్రభావాన్ని చూపుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన తాజా నివేదికలో విశ్లేషించింది. ముఖ్యంగా గ్రామీణ ఆదాయాల పెంపు, వ్యవసాయ ఉత్పాదకత, ఉపాధి కల్పనపై బడ్జెట్ పెట్టిన దృష్టి.. సబ్బులు, నూనెలు, బిస్కెట్ల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్‌ను పెంచేలా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

రైతు ముంగిట్లోకి 'భారత్-విస్తార్'

వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ బడ్జెట్‌లో ప్రకటించిన 'భారత్-విస్తార్' అనే బహుభాషా ఏఐ సాధనంపై ఎస్‌బీఐ ప్రశంసలు కురిపించింది. ఇది అగ్రిస్టాక్ పోర్టల్స్, ఐసీఏఆర్ పరిశోధనలను రైతులకు చేరువ చేస్తుంది. తద్వారా సాగులో ఉత్పాదకత పెరిగి, రైతుల జేబుల్లోకి అదనపు ఆదాయం చేరుతుందని, ఇది పరోక్షంగా గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందని నివేదిక పేర్కొంది.

మత్స్యకారులకు, పశుపోషకులకు మేలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు: నీలి విప్లవం: 500 రిజర్వాయర్లు మరియు అమృత్ సరోవర్ల సమగ్ర అభివృద్ధి ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడనుంది. పశుసంవర్ధక శాఖ: గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగం ద్వారా ఉపాధి పెంచేందుకు క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. పశువుల పెంపకం యూనిట్ల ఆధునికీకరణ ద్వారా కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్లు తయారవుతారని ఎస్‌బీఐ అభిప్రాయపడింది.

విభిన్న పంటలు.. విలక్షణ మార్కెట్లు

వ్యవసాయ రంగాన్ని కేవలం వరి, గోధుమలకే పరిమితం చేయకుండా.. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అధిక విలువ కలిగిన పంటలను ప్రోత్సహించడం ఈ బడ్జెట్‌లో విశేషం. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు సాగుకు, ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్లకు, అలాగే కొండ ప్రాంతాల్లో బాదం, అక్రోట్ (వాల్‌నట్స్), పైన్ నట్స్ వంటి పంటలకు ప్రత్యేక దన్ను లభించనుంది. ఈ విభిన్న రకాల పంటల సాగు ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, అది గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల డిమాండ్‌ను మరింతగా పెంచనుంది.

'షీ-మార్ట్'లతో మహిళా సాధికారత

గ్రామీణ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 'షీ మార్ట్స్' ఏర్పాటు ఒక విప్లవాత్మక అడుగు. క్లస్టర్ స్థాయి ఫెడరేషన్ల ద్వారా నడిచే ఈ రిటైల్ అవుట్‌లెట్లు స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా గొలుసును పటిష్టం చేస్తాయని నివేదిక వెల్లడించింది.

భవిష్యత్తుపై ఆశాభావం

దేశంలో ఆహార, నిత్యావసర వస్తువుల ధరల ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టడం, గ్రామీణ మార్కెట్లలో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడటం, స్థిరమైన ఉపాధి అవకాశాలు నెలకొనడం వంటి అంశాలు ఎఫ్‌ఎంసీజీ రంగానికి సానుకూలంగా మారనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే కాలంలో ఈ రంగం వృద్ధిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో 'జాగ్రత్తతో కూడిన ఆశాభావం' వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించడంతో వినియోగం పుంజుకుని, కంపెనీల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక విశ్లేషించింది.