Let's talk: editor@tmv.in
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోడీ పేరు ప్రస్తావన.. 'పిచ్చి రాతలు' అంటూ భారత్ ఆగ్రహం

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోడీ పేరు ప్రస్తావన.. 'పిచ్చి రాతలు' అంటూ భారత్ ఆగ్రహం

Shaik Mohammad Shaffee
2 ఫిబ్రవరి, 2026

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 2017లో ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు సంబంధించి ఒక ఇమెయిల్‌లో ఉన్న వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. అవి ఒక కరుడుగట్టిన నేరగాడి పిచ్చి రాతలని, వాటిని అసహ్యించుకుంటూ తిరస్కరించాలని ఆయన స్పష్టం చేశారు.

అసలేమిటి ఈ వివాదం?

అమెరికాకు చెందిన జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే వ్యక్తి లైంగిక నేరాలకు పాల్పడి జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి సంబంధించిన దాదాపు 30 లక్షల పేజీల రహస్య పత్రాలను (ఎప్‌స్టీన్ ఫైల్స్) అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అందులో ఒక ఇమెయిల్‌లో ప్రధాని మోడీ 2017 ఇజ్రాయెల్ పర్యటన ప్రస్తావన ఉంది. అయితే, ప్రధాని అధికారిక పర్యటన మినహా, ఆ ఇమెయిల్‌లో ఉన్న మిగిలిన విషయాలన్నీ అబద్ధాలని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

కాంగ్రెస్ విమర్శలు

ఈ పత్రాల్లో ప్రధాని పేరు ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. "భారత ప్రధాని పేరు ఇలాంటి వివాదాస్పద వ్యక్తి ఫైల్స్‌లో ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం" అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. మరో నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. విదేశాంగ శాఖ సమాధానం చెప్పినప్పటికీ, ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు.

ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం: బీజేపీ మండిపాటు

కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇమెయిల్‌ను కావాలనే ఎడిటింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎప్‌స్టీన్ నుంచి ప్రధాని మోడీ సలహాలు తీసుకున్నట్లు భ్రమ కలిగించేలా "అతని సలహా" అనే పదాలను కాంగ్రెస్ అదనంగా చేర్చిందని పాత్ర ధ్వజమెత్తారు. "పిల్లల అక్రమ రవాణా చేసే ఒక నేరగాడికి, ప్రధాని మోడీకి సంబంధం అంటగట్టడం నీచమైన చర్య" అని ఆయన మండిపడ్డారు.

ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్?

జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాలో ఒకప్పుడు పెద్ద ఫైనాన్సియర్. కానీ, అతడు మైనర్ బాలికల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడు. 2019లో జైలులో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా అతడి వద్ద దొరికిన 30 లక్షల పేజీల రికార్డులు, 2వేల వీడియోలు, లక్షా 80 వేల ఫోటోలను అమెరికా కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశారు. ఈ ఫైల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.