
ఎప్‌స్టీన్ కేసులో విచారణకు హాజరవుతాం: బిల్ క్లింటన్ దంపతులు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై హౌస్ ఓవర్‌సైట్ కమిటీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరయ్యేందుకు వారు అంగీకరించారు. ఈ మేరకు వారి తరఫు న్యాయవాదులు కమిటీకి అధికారికంగా సమాచారం అందించారు. ఇప్పటివరకు విచారణకు హాజరుకావాలని జారీ చేసిన సమన్లను క్లింటన్ దంపతులు ధిక్కరిస్తూ వస్తున్నప్పటికీ, కాంగ్రెస్ వారిపై కఠిన చర్యలకు సిద్ధమైన తరుణంలో ఈ ముందడుగు పడింది.
సభ ధిక్కరణ సెగ.. తప్పనిసరి పరిస్థితుల్లో!
గతేడాది ఆగస్టు నుంచే ఈ కమిటీ క్లింటన్ దంపతులకు సమన్లు జారీ చేస్తోంది. అయితే, వారు విచారణకు రావడానికి ససేమిరా అనడంతో.. కమిటీ చైర్మన్ జేమ్స్ కోమర్ వారిపై 'క్రిమినల్ కాంటెంప్ట్' (సభ ధిక్కరణ) చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ తీర్మానంపై సోమవారం రాత్రి హౌస్ ఫ్లోర్‌లో ఓటింగ్ జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో క్లింటన్ తరఫు న్యాయవాదులు ఈమెయిల్ పంపారు. పరస్పర అంగీకారంతో కుదిరిన తేదీల్లో విచారణకు హాజరవుతామని వారు హామీ ఇచ్చారు. ఈ ధిక్కరణ చర్యలు గనుక అమలైతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉండటంతో క్లింటన్ దంపతులు వెనక్కి తగ్గారు.
పూర్తిస్థాయి విచారణకే మొగ్గు
గతంలో బిల్ క్లింటన్ కేవలం ఇంటర్వ్యూ ఇస్తానని, హిల్లరీ క్లింటన్ లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పిస్తారని ప్రతిపాదించారు. కానీ, దీనిని చైర్మన్ కోమర్ తోసిపుచ్చారు. "క్లింటన్లు తమకు నచ్చినట్లు నిబంధనలు విధించలేరు. వారు కచ్చితంగా విచారణాధికారుల ముందు కూర్చుని ప్రమాణం చేసి వాంగ్మూలం ఇవ్వాల్సిందే" అని ఆయన ఖరాఖండిగా చెప్పారు. క్లింటన్ దంపతుల తాజా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, అయితే లిఖితపూర్వక హామీ లభించే వరకు ధిక్కరణ చర్యలను రద్దు చేయబోమని కోమర్ స్పష్టం చేశారు.
రాజకీయ రంగు.. విమర్శల పర్వం
మరోవైపు ఈ దర్యాప్తుపై డెమొక్రాట్లు మండిపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని, ఎప్‌స్టీన్ కేసులో ట్రంప్ ప్రభుత్వం వద్ద ఉన్న ఫైళ్లను బయటపెట్టకుండా కోమర్ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2019లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ తో 1990ల చివరలో, 2000 ప్రారంభంలో బిల్ క్లింటన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆరోపణలు రాలేదు. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై సభ ధిక్కరణ తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
బాధితుల పేర్లు బహిర్గతం కావడంతో పత్రాలు వెనక్కి
మరోవైపు, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వేలాది రహస్య పత్రాలను విడుదల చేసే క్రమంలో అమెరికా న్యాయశాఖ ఒక పెద్ద పొరపాటు చేసింది. బాధితుల ప్రైవసీని కాపాడటంలో భాగంగా వారి పేర్లు, వివరాలను దాచిపెట్టాల్సి ఉండగా, పొరపాటున కొన్ని పత్రాలలో అవి నేరుగా కనిపించాయి. దీనిపై బాధితులు, వారి తరఫు న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో, న్యాయశాఖ వెంటనే అప్రమత్తమైంది. దాదాపు వేల సంఖ్యలో ఉన్న పత్రాలను, మీడియా ఫైళ్లను తన వెబ్‌సైట్ నుండి తాత్కాలికంగా తొలగించింది. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల వల్లే ఈ పొరపాటు జరిగిందని ప్రభుత్వం అంగీకరించింది.
విమర్శల పాలవుతున్న విచారణ ప్రక్రియ
బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఆ పత్రాలను వెబ్‌సైట్ నుండి తీసివేసి, 24 నుండి 36 గంటల్లో వివరాలను గోప్యంగా ఉంచి మళ్ళీ అప్‌లోడ్ చేస్తామని న్యాయశాఖ తెలిపింది. విడుదల చేసిన మొత్తం పత్రాలలో కేవలం 0.001 శాతం మాత్రమే పొరపాట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, దీనివల్ల ఇతర కేసులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉదాహరణకు న్యూయార్క్‌లో జరుగుతున్న మరో సెక్స్ ట్రాఫికింగ్ విచారణలో కొందరు నిందితుల పేర్లు ఈ పత్రాల్లో బయటకు రావడంతో, తమకు న్యాయమైన విచారణ జరగదని వారు కోర్టును ఆశ్రయించారు.
