
ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై బిల్ గేట్స్ క్షమాపణలు!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితం, వివాదాస్పద వ్యక్తులతో సంబంధాల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాల గురించి గేట్స్ ఫౌండేషన్ సిబ్బంది ముందు ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేస్తూనే, ఎప్‌స్టీన్‌ను నమ్మి తన ఫౌండేషన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు సిబ్బందికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మంగళవారం జరిగిన టౌన్ హాల్ సమావేశంలో గేట్స్ ఈ విషయాలను వెల్లడించినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఎప్‌స్టీన్‌తో స్నేహం.. పెద్ద తప్పు!
"ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం నేను చేసిన అతిపెద్ద తప్పు" అని గేట్స్ వాపోయారు. 2008లోనే ఎప్‌స్టీన్‌తో మైనర్ల వ్యభిచారం కేసులో దోషిగా తేలినప్పటికీ, ఆ విషయాన్ని తాను సరిగ్గా గమనించలేదని, తన సతీమణి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ 2013లోనే ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేసినా తాను వినలేదని ఒప్పుకున్నారు. ఎప్‌స్టీన్‌తో సమావేశాలు నిర్వహించడం, ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడం ఫౌండేషన్ విలువలకు విరుద్ధమని ఆయన అంగీకరించారు. ఎప్‌స్టీన్‌తో ప్రపంచంలోని పలువురు బిలియనీర్లతో సన్నిహితంగా ఉండటం వల్లే, అది ఒక సాధారణ పరిచయంగా తనకు అనిపించిందని, కానీ అది ఎప్‌స్టీన్‌తో వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచేందుకు తనకు తెలియకుండానే సహకరించిందని గేట్స్ వివరించారు.
రష్యన్ మహిళలతో సంబంధాలు
ఇదే సమావేశంలో బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. తాను గతంలో ఇద్దరు రష్యన్ మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నానని అంగీకరించారు. వారిలో ఒకరు బ్రిడ్జ్ ప్లేయర్ కాగా, మరొకరు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అని తెలిపారు. ఈ విషయం ఎప్‌స్టీన్‌కు కూడా తెలుసని, అయితే తన సంబంధాలకు ఎప్‌స్టీన్ బాధితులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వెలుగుచూసిన ఫోటోలపై స్పందిస్తూ.. అవి ఎప్‌స్టీన్ అభ్యర్థన మేరకు ఆయన సహాయకులతో కలిసి దిగినవే తప్ప, ఆ ఫైల్స్‌లో పేర్కొన్న బాధితులతో తనకు ఎటువంటి సంబంధం లేదని గేట్స్ తేల్చి చెప్పారు.
ఫౌండేషన్ ప్రతిష్టకు నష్టం
అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ గత నెలలో ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసిన నేపథ్యంలో బిల్ గేట్స్ పేరు బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ ఫైల్స్ తన ఫౌండేషన్ ప్రతిష్టను మసకబార్చాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "మన పని క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జరిగిన పరిణామాలు మన ఫౌండేషన్ విలువలకు విరుద్ధం" అని సిబ్బందితో అన్నారు. 2014 తర్వాత తాను ఎప్‌స్టీన్‌ను మళ్లీ కలవలేదని గేట్స్ పేర్కొన్నారు. కాగా ఈ టౌన్ హాల్ సమావేశంలో బిల్ గేట్స్ నిక్కచ్చిగా మాట్లాడారని , తన చర్యలకు పూర్తి బాధ్యత వహించారని గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. లైంగిక నేరాల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
