
ఎప్‌స్టీన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు: ట్రంప్
సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో తనకు క్లీన్ చిట్ లభించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ నడిపిన చీకటి సామ్రాజ్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు నిజాలు ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దాచడానికేమీ లేదు..
అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఎప్‌స్టీన్ అంశంపై ట్రంప్ స్పందించారు. "నేను దాచడానికి ఏమీ లేదు. దర్యాప్తు సంస్థలు నాపై ఏదో ఒకటి దొరుకుతుందని ఆశించాయి, కానీ వారికి వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. నేను పూర్తిగా క్లీన్ చిట్‌తో బయటపడ్డాను. నిజానికి, నేను అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదని ఒక రచయితతో కలిసి ఎప్‌స్టీన్ ప్రయత్నాలు కూడా చేశాడు" అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మార్-ఏ-లాగో నుంచి బహిష్కరణ
గతంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చారు. ఎప్‌స్టీన్ ఒక వికృత చేష్టల వ్యక్తి అని గుర్తించినందునే, ఫ్లోరిడాలోని తన సొంత 'మార్-ఏ-లాగో' క్లబ్ నుంచి ట్రంప్ అతడిని అప్పట్లోనే వెళ్లగొట్టారని గుర్తు చేశారు. ఇతర ప్రముఖుల్లా కాకుండా, ఎప్‌స్టీన్ అసలు రంగు తెలిసిన వెంటనే ట్రంప్ అతడితో సంబంధాలను తెంచుకున్నారని, ఈ విషయంలో ఆయన ఎప్పుడూ నిజాయితీగా, పారదర్శకంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
పారదర్శకతకు నిదర్శనం
ఎప్‌స్టీన్ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సుమారు 30 లక్షల పత్రాలను విడుదల చేయడం తమ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ ఫైళ్ల విడుదల ద్వారా ఎప్‌స్టీన్ చేసిన హేయమైన నేరాలను వెలుగులోకి తెచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉందని లీవిట్ స్పష్టం చేశారు. ఈ దస్త్రాల వెల్లడి వల్ల ట్రంప్ ఇన్నేళ్లుగా చెబుతున్న మాటలు వాస్తవమని రుజువవుతున్నాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
సంబంధాల తెగింపుపై వివరణ
2000వ దశకం ఆరంభంలోనే ఎప్‌స్టీన్ తో సంబంధాలను తెంచుకున్నట్లు ట్రంప్ పలుమార్లు వెల్లడించారు. తన మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో పనిచేసే ఒక ఉద్యోగిని ఎప్‌స్టీన్ తన వైపు తిప్పుకోవడంతో, అప్పుడే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి దూరం పెట్టినట్లు ట్రంప్ గతంలోనే వివరించారు. స్కాండల్ పూర్తిగా బయటపడకముందే తాను అతడిని దూరం పెట్టానని, కానీ కొందరు కావాలనే తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఎవరీ జెఫ్రీ* *ఎప్‌స్టీన్* *?
అమెరికాలో రాజకీయ, వ్యాపార, వినోద రంగాల్లోని ప్రముఖులతో సంబంధాలు కలిగిన జెఫ్రీ ఎప్‌స్టీన్ , లైంగిక నేరాల కేసులో విచారణ ఎదుర్కొంటూ 2019లో జైలులోనే మరణించారు. అతడి మరణం తర్వాత బయటపడిన అనేక రహస్యాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఈ కేసులో అనేకమంది అంతర్జాతీయ ప్రముఖుల పేర్లు వినిపించగా, ట్రంప్ మాత్రం తాను ఎప్పుడో అతడికి దూరమయ్యానని చెబుతూ వస్తున్నారు.
