
ఎన్‌హెచ్ఏఐ టోల్ వసూలు వ్యయంలో రూ.2,062 కోట్లు ఆదా
2024–25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ప్రజా నిధులతో నిర్వహించే టోల్ ప్లాజాల వ్యయంలో గణనీయమైన ఆదాను సాధించింది. టోల్ వసూలు ఖర్చును రూ.2,062 కోట్ల మేర తగ్గించినట్లు ఎన్‌హెచ్ఏఐ వెల్లడించింది.
2023–24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు ఖర్చు రూ.4,736 కోట్లుగా ఉండగా, 2024–25లో అది రూ.2,674 కోట్లకు తగ్గింది. ఈ విధంగా, గత సంవత్సరం కంటే 43 శాతం వ్యయం తగ్గి, ఎన్‌హెచ్ఏఐకి రూ.2,062 కోట్ల ఆదా జరిగింది. శాతం పరంగా చూస్తే, టోల్ ఖర్చు 17.27 శాతం నుంచి 9.27 శాతానికి పడిపోయింది.
ఎన్‌హెచ్ఏఐ వివరాల ప్రకారం, 2023–24లో టోల్ ఏజెన్సీలు మొత్తం రూ.27,417 కోట్లు వసూలు చేయగా, అందులో రూ.22,681 కోట్లు సంస్థకు జమయ్యాయి. 2024–25లో టోల్ వసూలు రూ.28,823 కోట్లకు పెరగగా, అందులో రూ.26,149 కోట్లు ఎన్‌హెచ్ఏఐకి చేరాయి.
టోల్ వ్యయంలో తగ్గుదల ఎన్‌హెచ్ఏఐ తీసుకున్న పరిపాలనా సంస్కరణల ఫలితమని అధికారులు తెలిపారు. ప్రస్తుత కాంట్రాక్టుల పర్యవేక్షణ బలోపేతం చేయడం, ‘డీమ్డ్ ఎక్స్‌టెన్షన్’ నిబంధన తొలగించడం, సమయానికి టెండర్లు ఆహ్వానించడం, కాంట్రాక్టుల కాలవ్యవధిని గరిష్ఠంగా ఏడాది వరకు మాత్రమే పరిమితం చేయడం, మూడు నెలల స్వల్పకాలిక కాంట్రాక్టులను తగ్గించడం వంటి చర్యలు దీనికి దోహదపడ్డాయి.
అలాగే, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా మూడు ముందస్తు రద్దు అభ్యర్థనలను మాత్రమే అనుమతించారు. ముందస్తు రద్దు కోరిన కాంట్రాక్టర్‌ను అదే టోల్ ప్లాజా వేలంలో పాల్గొననీయకుండా నిషేధం విధించారు.
టోల్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వాటిపై విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎన్‌హెచ్ఏఐ 'ఆల్ ఇండియా యూజర్ ఫీ కలెక్షన్ ఫెడరేషన్'తో నిరంతర చర్చలు కొనసాగిస్తోంది. సంస్థ సమయానికి భద్రతా నిధులు, బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయడం వలన టెండర్ సామర్థ్యం పెరిగి, ఎక్కువ బిడ్లు దాఖలు అయ్యాయి.
టోల్ ఏజెన్సీలకు ఆకస్మిక లాభాలు దక్కకుండా ఉండేందుకు ఒప్పందాల్లో ‘ఆకస్మిక లాభాల క్లాజ్’ను ప్రవేశపెట్టింది. దీనిబట్టి, చివరి 15 రోజుల టోల్ వసూలు సగటు, ఎన్‌హెచ్ఏఐకి చెల్లించిన వాయిదాలో 40 శాతానికి మించితే, ఆ కాంట్రాక్టును రద్దు చేసే అధికారం సంస్థకు ఉంటుంది.
దేశవ్యాప్తంగా టోల్ కార్యకలాపాల్లో సామర్థ్యం, పారదర్శకత పెంపుపై ఎన్‌హెచ్ఏఐ చూపుతున్న నిరంతర కృతనిశ్చయత, రహదారి శాఖ సంస్కరణల్లో నూతన ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
