
ఎన్సీపీలో ప‘వార్’ ముగిసినట్టే!
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాబోయే పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నాయి. 2023లో అజిత్ పవార్ పార్టీని విడిచి వెళ్లిన తర్వాత, రెండు వర్గాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని ఎన్‌సీపీ (శరద్ పవార్) ప్రతినిధి అంకుష్ కాకడే మంగళవారం ధృవీకరించారు. ఎన్‌సీపీ–శరద్ చంద్ర పవార్, ఎన్‌సీపీ–అజిత్ పవార్ వర్గాలు కలిసి పుణె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇతర మిత్రపక్షాలతో ఈ మధ్యాహ్నం సమావేశం ఉందని ఆయన తెలిపారు.సీట్ల పంపకాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి నాలుగు పార్టీలు ఒకే సమావేశంలో కూర్చుని సీట్ల పంపకాలపై చర్చిస్తాం. అజిత్ పవార్ వర్గం, మా వర్గం సిద్ధాంతాలు ఒకటే అని కాకడే అన్నారు.
ఇదిలా ఉండగా, ఎన్‌సీపీ (శరద్ పవార్) నేత, పుణె సిటీ చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ పార్టీ సభ్యత్వంతో పాటు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే ముంబైకి పిలిపించారు. ఆమెతో సమావేశం అనంతరం నా తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని జగ్తాప్ చెప్పారు. పుణె ప్రజల ముందు బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలవాలనే ఉద్దేశంతో, బీజేపీ, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)గా ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన ప్రతిపాదన అని ఆయన పేర్కొన్నారు.
బలం పెంచుకుంటున్న బీజేపీ
ఇదే సమయంలో, మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు షెడ్యూల్ జారీ చేసింది. వీటిలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఉన్నాయి. జనవరి 15న పోలింగ్, జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పుణె జిల్లాలో బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ బలం పెంచుకుంటోంది. ఇటీవల నగరానికి చెందిన సుమారు 20 మంది మాజీ కార్పొరేటర్లుతో పాటు పలువురు కార్యాలయ బాధ్యులను బీజేపీ తన పార్టీలోకి చేర్చుకుంది. అంతేకాకుండా, మహాయుతి కూటమిలో భాగస్వామ్యమైన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ నుంచి 12 మంది నేతలు కూడా కమలం పార్టీలో చేరారు.
ముంబైలో జరిగిన ఈ చేరికల కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు మహేష్ లాండ్గే (భోసరి), శంకర్ జగ్తాప్ (చించ్వాడ్) నాయకత్వం వహించారు. ఈ పరిణామం పుణె జిల్లా రాజకీయాల్లో బీజేపీకి పెద్ద బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీలో చేరిన ప్రముఖుల్లో పీసీఎంసీ కమిటీ మాజీ చైర్‌పర్సన్ ఉషా వాఘేరే, మాజీ చైర్మన్ ప్రశాంత్ షిటోలే, మాజీ డిప్యూటీ మేయర్ ప్రభాకర్ వాఘేరే, మాజీ మేయర్ రాజు మిసాల్, మాజీ ప్రతిపక్ష నేత వినోద్ నాడే, సమీర్ మసూల్కర్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ నవనాథ్ జగ్తాప్ ఉన్నారు.
బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు
శివసేన (యూబీటీ) నేతలు సంజోగ్ వాఘేరే, అమిత్ గావడే, మీనల్తాయ్ యాదవ్, రవి లాండ్గేతో పాటు, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ సద్గురు కడమ్ (పింప్రి-చించ్వాడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ కడమ్ సోదరుడు) కూడా బీజేపీలో చేరారు.
