
ఎన్సీఈఆర్టీ పుస్తకం పై నిషేదం
న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై అధ్యాయం ఉన్న ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ, ముద్రిత, డిజిటల్ ప్రతులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని సుప్రీం కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థను దూషించేందుకు ఇది సూక్ష్మంగా పన్నిన కుట్రగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయమూర్తులు జోయ్ మాల్యబాగ్చీ, విపుల్ పంచోలీతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వారు కాల్పులు జరిపారు..న్యాయవ్యవస్థ రక్తస్రావం అవుతోందని సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ఆధ్యాయంలో అవినీతి, పెండింగ్ కేసుల భారం, న్యాయమూర్తుల కొరత వంటి సవాళ్లను ప్రస్తావించారు. న్యాయమూర్తులు కోడ్ ఆఫ్ కండక్ట్‌కు లోబడి ఉండాలని కూడా పేర్కొన్నారు. అయితే ఈ అంశాల ప్రస్తావన విద్యార్థుల్లో న్యాయవ్యవస్థపై తప్పుడు భావనలు కలిగించే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
పాఠ్యపుస్తకాన్ని రూపొందించిన ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌కు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇది యాదృచ్ఛిక పొరపాటు కాదనే అనిపిస్తోంది. దీని వెనుక లోతైన కుట్ర ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఎన్సీఈఆర్టీ బుధవారం పాఠ్యాంశంలోని అనుచిత విషయాలపై క్షమాపణ చెబుతూ, సంబంధిత అధికారులతో సంప్రదించి మళ్లీ రచిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ, కోర్టు ఆ వివరణతో సంతృప్తి చెందలేదు. క్షమాపణ అనే పదమే లేఖలో కనిపించలేదు. బదులుగా ఆ అధ్యాయాన్ని సమర్థించే ప్రయత్నం కనిపిస్తోందని ధర్మాసనం పేర్కొంది. సెంటర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నిర్ద్వంద్వ క్షమాపణ తెలిపారు. మార్కెట్లోకి వెళ్లిన 32 పుస్తకాలను ఉపసంహరిస్తున్నాం. మిగతావి పంపిణీ చేయం. మొత్తం అధ్యాయాన్ని కొత్త బృందంతో మళ్లీ పరిశీలిస్తాం. 8వ తరగతి విద్యార్థులకు దేశంలో న్యాయం దక్కడం లేదని బోధించమని తెలిపారు.
అయినప్పటికీ, కోర్టు తన కఠిన వైఖరి వీడలేదు. పుస్తకంలో ఉపయోగించిన పదాలు, భావప్రకటనలు సాధారణంగా చేసిన తప్పిదంలా లేదని, సంస్థ గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన చర్యగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇది నిర్ధారణైతే 1971 కోర్టు అవమాన చట్టంలోని సెక్షన్ 2(సీ) ప్రకారం క్రిమినల్ కాంటెంప్ట్ పరిధిలోకి వస్తుందని హెచ్చరించింది.
న్యాయవ్యవస్థ గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం సహించం. అవసరమైతే లోతైన దర్యాప్తు చేస్తాం. ఎంతవారైనా క్షమించమని సీజేఐ హెచ్చరించారు. పాఠ్యపుస్తకాన్ని మరింతగా ముద్రించడం, పునర్ముద్రించడం, డిజిటల్ రూపంలో ప్రచారం చేయడం పూర్తిగా నిషేధించామని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఎటువంటి ప్రయత్నాన్నైనా ఉద్దేశపూర్వక ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అయితే, ఈ చర్యలు న్యాయవ్యవస్థపై చట్టబద్ధ విమర్శలను అణచివేయడానికి కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో సముచిత పరిశీలన హక్కును ఎవరూ కాదనలేరని తెలిపింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా విచారణ ప్రారంభించింది. తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే, న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఎవరినైనా చట్టం ముందు నిలబెడతామని సీజేఐ బుధవారం తీవ్రంగా హెచ్చరించారు.
పాఠ్యపుస్తకాలను మళ్లీ రచించడంపై కాంగ్రెస్ విమర్శలు
ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో న్యాయవ్యవస్థపై విమర్శనాత్మక అంశాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం సముచితమేనని కాంగ్రెస్ గురువారం పేర్కొంది. గత దశాబ్దంగా పాఠ్యపుస్తకాలను మారుస్తుండడంపై ఆర్ఎస్ఎస్ ప్రేరిత దుష్ట, దురుద్దేశపూరిత చర్యగా సాగుతోందని ఆరోపించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్) జైరాం రమేశ్ ఎక్స్ లో చేసిన పోస్టులో గత పది సంవత్సరాలుగా ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల పున:రచన అవమానకరమైనదిగా, ప్రమాదకరమైనదిగా మారింది. ఇది ఆర్ఎస్ఎస్ ప్రేరిత దురుద్దేశపూరిత ప్రయత్నం. ఈ రాకెట్‌పై దర్యాప్తు జరగాలని ఆయన ఆరోపించారు.
