Let's talk: editor@tmv.in
ఎన్‌సీఈఆర్‌టీకి ‘డీమ్డ్ యూనివర్సిటీ’ హోదా

ఎన్‌సీఈఆర్‌టీకి ‘డీమ్డ్ యూనివర్సిటీ’ హోదా

Shaik Mohammad Shaffee
4 ఏప్రిల్, 2026

దేశీయ పాఠశాల విద్యా ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలికి (ఎన్‌సీఈఆర్‌టీ) కేంద్ర ప్రభుత్వం ‘డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ’ హోదాను కల్పించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సిఫార్సు మేరకు ఎన్‌సీఈఆర్‌టీతో పాటు దాని అనుబంధ సంస్థలకు ఈ హోదా కల్పిస్తూ కేంద్ర విద్యా శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఎన్‌సీఈఆర్‌టీ ఇకపై ఇతర విశ్వవిద్యాలయాలపై ఆధారపడకుండా సొంతంగా డిగ్రీలను ప్రదానం చేసే అధికారాన్ని పొందింది.

అనుబంధ సంస్థలకూ గుర్తింపు

ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాని ఆరు అనుబంధ విభాగాలకు కూడా ఈ హోదా లభించింది. అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్‌లలో ఉన్న ప్రాంతీయ విద్యా సంస్థలు, అలాగే భోపాల్‌లోని పండిట్ సుందర్‌లాల్ శర్మ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థలు ఇకపై డీమ్డ్ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ సంస్థల్లో నడిచే కోర్సులు ఆయా రాష్ట్రాల్లోని స్థానిక విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్నాయి. హోదా మార్పుతో ఇవి నేరుగా ఎన్‌సీఈఆర్‌టీ పేరుతోనే డిగ్రీలు జారీ చేస్తాయి.

‘డి నోవో’ విభాగంలో అరుదైన అవకాశం

మూడేళ్ల క్రితమే ఎన్‌సీఈఆర్‌టీకి ‘డి నోవో’ విభాగంలో డీమ్డ్ హోదా ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సాధారణ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో లేని సరికొత్త, వినూత్నమైన అంశాల్లో పరిశోధనలు, విద్యా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు మాత్రమే ఈ హోదాను కల్పిస్తారు. పాఠశాల విద్యా రంగంలో బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళికా రూపకల్పన వంటి అంశాల్లో ఎన్‌సీఈఆర్‌టీ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి కేంద్రం ఈ గౌరవాన్ని కల్పించింది.

నిబంధనలు.. కఠిన ఆదేశాలు

హోదాను కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులను కూడా విధించింది. ఎన్‌సీఈఆర్‌టీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాభార్జనే ధ్యేయంగా, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. అన్ని విద్యా కోర్సులు యూజీసీ నిబంధనల ప్రకారమే ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా కొత్తగా ఆఫ్‌-క్యాంపస్‌లు, విదేశీ క్యాంపస్‌లను ప్రారంభించాలంటే ముందుగా యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

పరిశోధనలు, డాక్టరేట్‌లకు ప్రాధాన్యం

ఈ కొత్త హోదాతో ఎన్‌సీఈఆర్‌టీ ఇకపై వినూత్న విద్యా కార్యక్రమాలతో పాటు పీహెచ్‌డీ వంటి ఉన్నత స్థాయి పరిశోధన కోర్సులను ప్రారంభించనుంది. విద్యారంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని కేంద్రం సూచించింది. పాఠశాల విద్యా నాణ్యతను పెంచేందుకు అవసరమైన సమగ్ర పరిశోధనలకు ఈ హోదా ఒక వరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

ర్యాంకింగ్‌లు.. డిజిటల్ లాకర్లు తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఎన్‌సీఈఆర్‌టీ ఇకపై ప్రతి సంవత్సరం 'నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్' (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్‌లలో తప్పనిసరిగా పాల్గొనాలి. విద్యార్థుల కోసం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఐడీలను సృష్టించాలని, వారి క్రెడిట్ స్కోర్‌లను డిజిటల్ లాకర్లలో భద్రపరచాలని సూచించింది. విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, విద్యార్థుల విద్యా రికార్డులను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.