Let's talk: editor@tmv.in
ఎన్పీఎస్ చందాదారులకు మరింత వెసులుబాటు

ఎన్పీఎస్ చందాదారులకు మరింత వెసులుబాటు

Dantu Vijaya Lakshmi Prasanna
21 డిసెంబర్, 2025

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకునే నిబంధనలలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్పులు చేసింది. 'పీఎఫ్ఆర్డీఏ(ఎన్పీఎస్ కింద నిష్క్రమణలు ఉపసంహరణలు) నిబంధనలు, 2015'కు ఈ అప్‌డేట్‌లు వర్తిస్తాయి. ప్రజలు తమ పదవీ విరమణ కోసం నగదును మెరుగ్గా నిర్వహించుకోవడంలో సహాయపడటమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యం.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా ప్రభుత్వేతర ఉద్యోగులపై దృష్టి సారించాయి. ఇందులో కార్పొరేట్ రంగంలోని వ్యక్తులు, "ఆల్ సిటిజన్ మోడల్" (సాధారణ పౌరులు) కింద ఉన్నవారు వస్తారు. వివిధ రకాల పెన్షన్ ప్లాన్లకు ఈ మార్పులు ఒకే విధంగా వర్తిస్తాయి. అదే సమయంలో, ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఎఫ్ఆర్డీఏ కూడా కొన్ని నిబంధనలను సరళీకరించింది. వివిధ వర్గాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్పులు చేయబడ్డాయి.

ముఖ్యమైన అంశాలు:

కొత్త చర్యలు చందాదారులకు పెట్టుబడి నిర్ణయాల విషయంలో మరింత స్వేచ్ఛను మరిన్ని ఎంపికలను అందిస్తాయి. ప్రభుత్వేతర వ్యక్తులకు ఎన్పీఎస్ అనేది ఐచ్ఛికం కాబట్టి, నిధుల ఉపసంహరణపై స్పష్టమైన నియమాలు ఉండటం చాలా ముఖ్యం. స్పష్టమైన విధివిధానాలు ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఈ పథకంలో చేరడానికి, కొనసాగడానికి ఆసక్తి చూపుతారని పీఎఫ్ఆర్డీఏ భావిస్తోంది. ఇది ప్రస్తుత అవసరాలకు భవిష్యత్తు పొదుపు లక్ష్యాలకు మధ్య సమతుల్యతను కలిగిస్తుంది.

వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను ప్రోత్సహించడం, చందాదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం పీఎఫ్ఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్పీఎస్ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, పాలసీని సులభతరం చేయాలని అథారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త నిబంధనలు ప్రజలు తమ జీవితంలోని వివిధ దశల్లో "సమకూరిన పెన్షన్ సంపదను" కాపాడుకోవడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ప్రభుత్వేతర చందాదారులు ఇప్పుడు తమ పెట్టుబడిని ఎంచుకోవడంలో పాక్షిక ఉపసంహరణలు చేసుకోవడంలో గతంలో కంటే ఎక్కువ స్వేచ్ఛను కలిగి ఉంటారు. పిల్లల చదువు, పెళ్లి లేదా అనారోగ్యం వంటి కారణాల కోసం నిర్దిష్ట నిబంధనలతో కొంత డబ్బును ముందే తీసుకోవచ్చు.

ప్రయోజనాలు:

ఈ పథకంలో చేరితే పదవీ విరమణ సమయంలో మీరు జమ చేసిన మొత్తంలో 60% నగదును ఒకేసారి తీసుకోవచ్చు (దీనిపై ఎటువంటి పన్ను ఉండదు). మిగిలిన 40% మొత్తంతో ఏదైనా బీమా సంస్థ నుండి నెలవారీ పెన్షన్ ప్లాన్ తీసుకోవాలి. దీని ద్వారా మీకు జీవితాంతం పెన్షన్ వస్తుంది.

దీనిలో మళ్లీ రెండు రకాలు ఉంటాయి. మొదటిది, టైర్ 1( తప్పనిసరి ఖాతా) , ఇది పదవీ విరమణ కోసం ఉద్దేశించినది. దీని నుండి డబ్బును పూర్తిగా విత్‌డ్రా చేయడానికి నిబంధనలు ఉంటాయి. ఆదాయపు పన్ను మినహాయింపులు దీనికే వర్తిస్తాయి. రెండవది, టైర్ 2 ( ఐచ్ఛిక ఖాతా) ఇది ఒక సేవింగ్స్ ఖాతా లాంటిది. మీకు నచ్చినప్పుడు డబ్బు జమ చేయవచ్చు. విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి పన్ను ప్రయోజనాలు ఉండవు (ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపులు ఉండవచ్చు).

ముఖ్యంగా మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకి,

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి (ఎక్కువ రిస్క్, ఎక్కువ లాభం), కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి (సురక్షితం) లాంటివి. ఇందులో మీకు ఏమికావాలో మీరు స్వయంగా ఎంచుకోవచ్చు , లేదా మీ వయస్సును బట్టి ఆటోమేటిక్‌గా మారేలా సెట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ మేనేజ్‌మెంట్ ఫీజు ఉన్న పెన్షన్ పథకాలలో ఇది ఒకటి.సెక్షన్ 80 C కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబబడి పెట్టవచ్చు. సెక్షన్ 80CCD(1B) కింద అదనంగా మరో రూ.50,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం మారినా లేదా ఒక నగరం నుండి మరో నగరానికి వెళ్లినా మీ ఎన్పీఎస్ ఖాతా (పిఆర్ఏఎన్ నంబర్) మారదు.

ఎన్పీఎస్ చందాదారులకు మరింత వెసులుబాటు - Tholi Paluku