Let's talk: editor@tmv.in
ఎన్నికల హామీలలో 97శాతం అమలు చేశాం: కేరళ సీఎం

ఎన్నికల హామీలలో 97శాతం అమలు చేశాం: కేరళ సీఎం

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుతున్న సమయంలో అధికార లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం తమ ఐదేళ్ల పాలనపై పురోగతి నివేదికను విడుదల చేసింది. 2021 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో సుమారు 97 శాతం ఇప్పటికే అమలు చేశామని ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ తెలిపారు. కన్నూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నివేదికను విజయన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు స్థితిని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఆ హక్కును గౌరవిస్తూ 2016 నుంచి ప్రతి ఏడాది ప్రభుత్వం పురోగతి నివేదికను ప్రజల ముందుకు తీసుకొస్తోందని చెప్పారు. 2021 మేనిఫెస్టోలో మొత్తం 900 హామీలు ప్రజల ముందుంచామని, వాటిలో చాలా భాగం ఇప్పటికే పూర్తిగా అమలయ్యాయని లేదా అమలు దశలో ఉన్నాయని తెలిపారు. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు లైఫ్‌ మిషన్‌ ద్వారా సుమారు 5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు భద్రమైన నివాసం లభించిందన్నారు. గత దశాబ్దంలో 4.5 లక్షలకుపైగా కుటుంబాలకు భూమి హక్కు పత్రాలు అందజేశామని, ముఖ్యంగా ఇడుక్కి వంటి కొండ ప్రాంతాల్లో సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించామని చెప్పారు.

మహిళలకు నెలవారీ సహయం అందిస్తున్నాం

అత్యంత పేదరికాన్ని తగ్గించడంలో కేరళం కీలక పురోగతి సాధించిందని ఆయన తెలిపారు. 64 వేలకుపైగా కుటుంబాలను తీవ్రమైన పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. అత్యంత బలహీన వర్గాలను రక్షించేందుకు వారి ఏకైక ఇళ్లను స్వాధీనం చేసుకోకుండా నిరోధించే చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు 16 లక్షలకుపైగా మహిళలకు నెలవారీ సహాయం అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, అనాథాశ్రమాల్లోని పిల్లల సంక్షేమ చర్యలను కూడా బలోపేతం చేశామని చెప్పారు.

బిజినెస్‌ ర్యాకింగ్స్‌లో కేరళం ముందంజ

ఆర్థిక రంగంలో కూడా రాష్ట్రాన్ని వ్యాపారాలకు అనుకూలంగా మార్చామని, దీంతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో కేరళం ముందంజలో నిలిచిందని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామని, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా మూడు లక్షలకుపైగా నియామకాలు జరిగాయని చెప్పారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది యువతకు అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. విద్య రంగంలో డిగ్రీ కోర్సులను ఉచితంగా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారులు, టన్నెల్ మార్గాలు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అలాగే విజింజమ్‌ అంతర్జాతీయ సముద్రపోర్టు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, దీనిని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన వారికి ఇళ్ల నిర్మాణంలో కూడా ప్రభుత్వం సహాయం అందించిందన్నారు. ఎల్‌డీఎఫ్‌ పాలనలో కేరళంలో పెద్దగా సామాజిక ఉద్రిక్తతలు లేకుండా శాంతి నెలకొన్నదని చెప్పారు. ద్వేషం, వివక్ష లేకుండా ప్రజలు కలిసి జీవించే సమాజాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రపంచ అభివృద్ధి ధోరణులకు అనుగుణంగా ‘న్యూ కేరళం’ నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తామని విజయన్ తెలిపారు.