
ఎన్నికల వేళ జేడీయూకు పెద్ద దెబ్బ
బీహార్ లో ఎన్నికల ముంగిట జేడీయూకు షాక్ తగిలింది. జేడీయూ నుంచి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కుష్వాహా, మాజీ ఎమ్మెల్యే రాహుల్ శర్మ ఇద్దరూ అధికార పార్టీని వదిలి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లో శనివారం చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కొద్దిమందికి మాత్రమే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మా సూచనలను, సలహాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు ఆత్మగౌరవం లేని చోట ఉండకూడదనుకున్నాం. మా నియోజకవర్గాల్లో సమస్యల గురించి చెబితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగంపై తేజస్వీ దృష్టి పెట్టారు. అందుకే ఆర్జేడీలో చేరామని తెలిపారు. తేజస్వీ యాదవ్ నాయకత్వంలో బీహార్ లో ప్రభుత్వం ఏర్పడుతుంది. నవంబర్ 14న ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సంతోష్ కుమార్ కుష్వాహా — పూర్ణియా నియోజకవర్గం నుంచి 2014, 2019లో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2024లో స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ చేతిలో ఓడిపోయారు. అలాగే రాహుల్ శర్మ జహానాబాద్ జిల్లా, ఘోసీ నియోజకవర్గం నుంచి 2010–2015లో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తమ నియోజకవర్గాల్లో వీరు ప్రభావం చూపగలరు. కానీ మిగతా స్థానాల్లో అంతగా ప్రభావం చూపెట్టకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ లోని 243 శాసన సభ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటిదశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న నిర్వహిస్తారు. ఎన్నికల కౌంటింగ్ అదే నెల 14 ఉండనుంది.
