
ఎన్నికల వేళ ఆర్జేడీ మెడకు ఐఆర్‌సీటీసీ కేసు
బీహార్‌లో ఎన్నికల ముంగిట ఆర్జేడీకి షాక్ తగిలింది. 2004–2009 యూపీఏ హయాంలో ఐఆర్‌సీటీసీ హెటళ్ల నిర్వహణ ఒప్పందం కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ సహా 14 మంది నిందితులపై కుట్రపూరిత, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆరోపణలు మోపింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, నిందితులందరిపై ఆరోపణలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని స్పెషల్ జడ్జి (సీబీఐ) పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ, రబ్రీ, తేజస్వి యాదవ్ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టుకు వీల్‌చైర్‌లో హజరయ్యారు. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.పి.సింగ్, న్యాయవాది మనూ మిశ్రా వాదనలు వినిపించారు. లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ మనీందర్ సింగ్ వాదిస్తూ, టెండర్ ప్రక్రియలో ఎటువంటి అవినీతి జరగలేదని, లాలూ యాదవ్‌ను కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
కేసు వివరాలు
లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి రాంచీ, పూరీ ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ ఒప్పందాల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపణలు చేసింది. సీబీఐ ఆరోపణల ప్రకారం, ఈ హోటల్ కాంట్రాక్టులు బీహార్‌కు చెందిన ప్రముఖ టూరిజం హెటళ్ల నిర్వాహకులైన విజయ్, వినయ్ కొచర్‌లకు చెందిన సుజాతా హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కి అప్పగించారు. దానికి ప్రతిఫలంగా ఓ బినామీ కంపెనీ ద్వారా మూడు ఎకరాల భూమి లాలూ ప్రసాద్ యాదవ్ బహుమతిగా పొందినట్లు ఆరోపించారు. హోటళ్లను అప్పగించినందుకు వీరి మధ్య క్విడ్ ప్రో కో జరిగిందని సీబీఐ తెలిపింది. దీంతో కోర్టు లాలూ, రబ్రీ, తేజస్విపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 120బీ (క్రిమినల్ కుట్ర), అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(d) కింద అభియోగాలు మోపింది.
ఈ కేసులో సీబీఐ జూలై 7, 2017న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2018 ఏప్రిల్‌లో చార్జ్‌షీట్ సమర్పించింది. కోర్టు 2025 మే 29న వాదనలు ముగించి, సెప్టెంబర్ 24న నిందితులు అక్టోబర్ 13న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అభియోగాలు మోపడంతో కేసు విచారణ దశకు చేరుకుంది. అయితే ఈ కేసు పూర్తి కావాలంటే దాదాపు ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలం కావచ్చు. అలాగే కేసు రుజువైతే తీవ్రతను బట్టి ప్రధాన నిందితుడికి 7 సంవత్సరాల శిక్ష, సహ నిందితులకు మూడు నుంచి ఐదు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ వారిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మేం విచారణను ఎదుర్కొంటాం. నిజం బయటపడుతుంది అని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది రాజకీయ కుట్ర:తేజస్వి యాదవ్
రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తనపై అభియోగాలు మోపిన నేపథ్యంలో స్పందించారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ఇది రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా చరిత్రలో పేరు పొందారని ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకు రూ.90,000 కోట్ల లాభం వచ్చిందని, బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ప్రజలపై టికెట్ చార్జీలను తగ్గించారని గుర్తు చేశారు. హార్వర్డ్, ఐఐఎం విద్యార్థులు కూడా ఆయన చేపట్టిన నిర్వహణ విధానాన్ని పరిశోధించడానికి వచ్చినట్లు తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ మేనేజ్ మెంట్ గురు’గా గుర్తింపు పొందారని చెప్పారు.ఈ విషయాలు దేశ ప్రజలకు, ముఖ్యంగా బీహార్ వాసులకు తెలుసని అన్నారు.
అలాగే మేం ఈ కేసును ఎదుర్కొని పోరాడుతాం. ప్రారంభం నుంచి చెప్పినట్లే, ఎన్నికల సమయంలో ఇలా జరుగుతుందని మాకు తెలుసు. కోర్టు తీర్పును మేం గౌరవిస్తాం. బిహార్ ప్రజలకు అన్నీ తెలుసు. ఈ కేసులో ఏం జరుగుతోందో వారికి తెలుసు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆరోపించారు. అలాగే తేజస్వీ బతికనంత కాలం బీజేపీతో పోరాటం సాగిస్తారని వివరించారు.
ఎన్నికలపై ప్రభావం
ఎన్నికల ముంగిట లాలూ, రబ్రీ, తేజస్విపై కోర్టు అభియోగాలు మోపడంతో ఆర్జేడీ ప్రతిష్టకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్షాలు ముఖ్యంగా ఎన్డీయేలోని జేడీయూ, బీజేపీ దీనిని అవినీతి కుటుంబం అని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ కేసు అంశంపై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసి ప్రజాభిప్రాయంలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. మహాఘట్బంధన్ తరపున సీఎం అభ్యర్థిగా ఉండే అర్హతలు ఉన్నందున ఇప్పడు తేజస్వీపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే వీలుంది. ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో ఓ ఇమేజ్‌తో ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇటువంటి సమయంలో ఎదుటి పక్షానికి అస్త్రాలు అందించినట్లే అవుతుంది. మరింతగా ఆర్జేడీ కుటుంబాన్ని అవినీతి కుటుంబంగా ప్రోజెక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది. బీజేపీ ఇప్పటికే జంగిల్ రాజ్ 2.0 అనే నినాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది. ఎన్నికల ప్రచారంలో ‘లాలూ రాజ్’ తిరిగి వస్తుందా? అనే భయాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేయవచ్చు.
ఇదిలాఉంటే ఆర్జేడీ కూడా ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రజల్లో దీనిని రాజకీయ కుట్రగా చూపించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ,ఐటీ కేసులు ఇప్పటికే దాదాపు ప్రభుత్వ ప్రేరేపితంగా ఉంటాయనే అనుమానం ప్రజల్లో ఉంది. దీన్ని కూడా అదే విధంగా ప్రచారం చేసేందుకు ఆర్జేడీ ప్రయత్నం చేయవచ్చు. తద్వారా సానుభూతి పొందే వీలుంది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీహార్‌లో బలమైన సామాజిక వర్గాలైన ఓబీసీ, మైనారీటి వర్గాల్లో ప్రాధాన్యం ఉంది. అలాగే బీహార్ ప్రజల్లో తేజస్వీ యాదవ్‌కు అదరణ ఉంది. అయితే ఏ పార్టీయైన దీన్ని ఏవిధంగా ఉపయోగించుకుంటుందన్న దాని బట్టే ఫలితం ఉంటుంది.
లాలూ ప్రసాద్ యాదవ్‌పై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే తీర్పులు వచ్చాయి. మరికొన్ని విచారణలో ఉన్నాయి.
తీర్పు వచ్చిన కేసులు
ఫోడర్ స్కామ్(పశుదాణా కేసు)
లాలూ ప్రసాద్ యాదవ్ 2013లో ఫోడర్ స్కామ్ కేసులో దోషిగా తేలి 5 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు.
ఈ కేసులో మొత్తం 53 కేసుల్లో 44 కేసులు పూర్తయ్యాయి, 500 మందికి పైగా నిందితులు శిక్షలు అనుభవించారు.
చైబాసా ట్రెజరీ కేసు
లాలూ ప్రసాద్ యాదవ్ 2013లో ఈ కేసులో దోషిగా తేలి 5 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు.
డుమ్కా ట్రెజరీ కేసు
లాలూ ప్రసాద్ యాదవ్ 2018లో ఈ కేసులో దోషిగా తేలి 7 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు.
విచారణలో ఉన్న కేసులు
ఐఆర్ సీటీసీ హోటల్ అవినీతి కేసు
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి, తేజశ్వి యాదవ్ తదితరులు నిందితులుగా ఉన్నారు.
అక్టోబర్ 13, 2025న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో ఆరోపణలు విధించింది.
కేసు 2004–2009 మధ్య కాలంలో IRCTC హోటల్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై ఆధారపడి ఉంది.
భూమి ఇస్తే ఉద్యోగాలు
ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తేజశ్వి యాదవ్ తదితరులు నిందితులుగా ఉన్నారు.
సీబీఐ ఈ కేసులో ఆరోపణలు నమోదు చేసింది.
సుప్రీం కోర్టు ఈ కేసులో ఆరోపణలు విధించడానికి అనుమతించింది.
